నేడు టీమిండియా కీలక ఎంపిక.. ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఈనెల 30 నుంచి ఆరంభమయ్యే ఆసియాకప్ కోసం టీమిండియా సెలక్షన్ కమిటీ ఇవాళ ప్రకటించనుంది. ప్రపంచకప్ 2023కి కూడా ఇంచుమించుగా ఇదే జట్టును కొనసాగించే అవకాశం ఉంది.
దీంతో టీమ్ సెలక్షన్ ప్రాధాన్యం సంతరించుకుంది. కోలుకున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ సహా 15 మంది సభ్యులతో కూడిన జట్టు ఎంపిక ఉత్కంఠ కలిగిస్తోంది.
ఈ మేరకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తో కలిసి సెలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు.
సాధారణంగా కోచ్ ఎంపిక కమిటీ సమావేశాల్లో పొల్గొనరు. సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్ కోసం సెలక్టర్లు ముసాయిదా జట్టును ఎంపిక చేసే అవకాశముంది. సెప్టెంబర్ 5లోగా ఐసీసీ(ICC)కి ముసాయిదా జట్టును సమర్పించాల్సి ఉంది.
details
వికెట్ కీపర్ అంశంలో రాహుల్ ఫిట్‌నెసే జట్టుకు కీలకం
రానున్న రెండు మెగా టోర్నీలకు దాదాపుగా ఒకే జట్టును ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ స్పష్టతనిస్తోంది.
స్టాండ్‌బై ఆటగాళ్లతో పాటు ఎంపికైన టీమ్ ఆసియాకప్ నేపథ్యంలో శ్రీలంకలో పర్యటించేందుకు ముందు బెంగళూరులో 6 రోజుల శిబిరంలో పాల్గొననుంది.
ఐర్లాండ్ మ్యాచులకు జట్టులోకి వచ్చిన పేసర్ బుమ్రాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే తెలుస్తోంది. వికెట్ కీపర్ అంశంలో రాహుల్ ఫిట్‌నెస్ కీలకం.
రాహుల్ ఎంపికైతే వికెట్ కీపింగ్ సహా 5వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నారు. లేనిపక్షంలో ఇషాన్ కిషన్ రేసులో ముందుంటాడు. శ్రేయస్ ఫిట్‌నెస్ సాధిస్తే నాలుగో స్థానం భర్తీ చేయనున్నారు.
లేదంటే సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్‌లను మరోసారి ప్రయత్నించవచ్చు. యువబ్యాటర్ తిలక్ వర్మ పేరు చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు.