Asian Games 2023 : ఆసియా క్రీడల్లో భారత్ ఘోర ఓటమి.. చైనా చేతిలో ఎదురుదెబ్బ
ఆసియా క్రీడలు 2023ని భారతదేశం ఓటమితో ప్రారంభించింది. ఈ క్రమంలోనే పురుషుల ఫుట్‌బాల్ జట్టు చైనా చేతిలో ఘోర పరాజయంతో ఆరంభించింది. కనీసం ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ చేయకుండానే, కేవలం 16 గంటల్లోనే మ్యాచ్ బరిలోకి దిగింది భారత్. మరోవైపు సబ్‌స్టిట్యూట్‌లుగా దించేందుకూ సరిపడ బెంచీ కూడా లేకపోవడం గమనార్హం. చివరకు ఊహించినట్టే ఇండియాకు ఓటమి తప్పలేదు. ఆతిథ్య చైనాతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 1-5 తేడాతో ఓటమి చవిచూసింది. ప్రయాణాలతో అలసిపోవడం, సన్నద్ధతలేమి, వాతావరణం వేడిగా ఉండటం లాంటి కారణాలతో భారత ఆటగాళ్లు పోటీ కూడా ఇవ్వకుండానే చేతులెత్తేశారు. భారత్ తరఫున రాహుల్ కేపీ (45+1) నిమిషంలో గోల్ చేశారు. దీంతో ఆట మొదటి అర్ధ భాగం 1-1తో ముగిసింది.
తదుపరి మ్యాచులు తప్పక గెలవాల్సిన పరిస్థితి
రెండో అర్ధ భాగంలో డ్రాగన్ ప్లేయర్లు అనూహ్యంగా నాలుగు గోల్స్ చేసి ప్రత్యర్థి ఇండియాను కోలుకోకుండా దెబ్బతీశారు. ఆతిథ్య జట్టు చైనా తరఫున గియావో తియానీ (17వ నిమిషం), డై వీజున్ (51వ నిమిషం), టావో కియాంగ్‌లాంగ్ (72, 75వ నిమిషం), హావో ఫాంగ్ (90+1వ నిమిషం)లో గోల్స్ చేయడంతో భారత్ ను చిత్తుగా ఓడింది. గ్రూప్ 'ఎ'లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచులో టీమిండియా తరఫున రాహుల్ కేపీ ఏకైక గోల్ చేయడం గమనార్హం. భారత్ రెండో రౌండ్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. రానున్న మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, మయన్మార్‌లను ఓడిస్తేనే సెకండ్ రౌండ్ కు అర్హత సాధిస్తుంది.