Page Loader
Wrestler Shot Dead: శివరాత్రి జాతరలో దారుణం.. రెజ్లర్‌ను కాల్చిచంపిన దుండగులు
శివరాత్రి జాతరలో దారుణం.. రెజ్లర్‌ను కాల్చిచంపిన దుండగులు

Wrestler Shot Dead: శివరాత్రి జాతరలో దారుణం.. రెజ్లర్‌ను కాల్చిచంపిన దుండగులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 27, 2025
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

శివరాత్రి సందర్భంగా నిర్వహించిన జాతరలో రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఓ రెజ్లర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన హర్యానాలోని ఖర్గోడా జిల్లా కుండల్ గ్రామంలో జరిగింది. తుపాకీ కాల్పుల్లో 35 ఏళ్ల రెజ్లర్ రాకేశ్ మృతి చెందాడు. అతను సోతి గ్రామానికి చెందినవాడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం రోహ్‌తక్‌లో కుటుంబంతో నివసిస్తున్న రాకేశ్, తన స్వగ్రామంలో ఓ రెజ్లింగ్ అకాడమీని నిర్వహిస్తున్నాడు. రాకేశ్‌ కుటుంబానికి సంబంధించి పాత కక్షలే ఈ హత్యకు కారణమని, భూమి వివాదంతో మనోజ్ అనే వ్యక్తితో అతనికి గతంలో వివాదం ఉందని మృతుడి మామ చాంద్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ మనోజ్ మరో వ్యక్తితో కలిసి రాకేశ్‌పై దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు.

Details

కేసు నమోదు చేసుకున్న పోలీసులు

శివరాత్రి సందర్భంగా జరిగిన రెజ్లింగ్ పోటీల్లో తన కుమారుడు అమృత్ ఇతర క్రీడాకారులతో కలిసి పాల్గొన్న రాకేశ్‌పై దాడి జరిగింది. అమృత్ బౌట్ ముగిసిన తర్వాత కారులో వెళ్ళేందుకు సిద్ధమవుతున్న సమయంలో, మనోజ్, సాహిల్ అనే ఇద్దరు వ్యక్తులు తుపాకులతో వచ్చి రాకేశ్‌పై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. అతను పారిపోవడానికి ప్రయత్నించినా వెంటాడి మరీ కాల్చి చంపారు. తీవ్రంగా గాయపడిన రాకేశ్‌ను ఆసుపత్రికి తరలించినా అప్పటికే అతను మరణించాడు. అతని శరీరంలో 8 బుల్లెట్ గాయాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని సోనిపట్ సివిల్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.