Page Loader
AUS vs IND: నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ ఆరంభం.. ఆస్ట్రేలియా ఓపెనర్‌గా నాథన్‌ మెక్‌స్వీ
నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ ఆరంభం.. ఆస్ట్రేలియా ఓపెనర్‌గా నాథన్‌ మెక్‌స్వీ

AUS vs IND: నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ ఆరంభం.. ఆస్ట్రేలియా ఓపెనర్‌గా నాథన్‌ మెక్‌స్వీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2024
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారత్‌తో జరగబోయే 2024 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ మ్యాచ్ కోసం తమ జట్టును ప్రకటించింది. 13 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఆసక్తికరమైన ఎంపికలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ఎవరు ఆరంభిస్తారన్న ప్రశ్నకు సమాధానం లభించింది. భారత్-ఏతో జరిగిన అనధికార టెస్ట్ మ్యాచ్‌లో ఆకట్టుకున్న నాథన్ మెక్‌స్వీనీ, భారత జట్టుపై తన తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 39 మరియు 88 పరుగులతో రాణించాడు. అంతకుముందు, దేశవాళీ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలోనూ నిలకడగా ప్రదర్శన ఇచ్చాడు.

వివరాలు 

మెరుగైన ప్రదర్శన చేసినందున నాథన్ మెక్‌స్వీనీ ఎంపిక

దిగ్గజ ఆటగాడు డేవిడ్ వార్నర్ రిటైర్ అయ్యాక ఉస్మాన్ ఖవాజా సరసన స్థిరమైన ఓపెనింగ్ జోడి లేక ఆస్ట్రేలియా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. స్టీవ్ స్మిత్‌ను ఓపెనర్‌గా ప్రయోగించినా, ఆశించిన ఫలితం రాలేదు. గత రెండు సార్లు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత్ చేతిలో కోల్పోయిన ఆసీస్, ఈసారి ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్‌ను తీసుకుని, విజయాన్ని సాధించడానికి కొత్త వ్యూహంతో ముందుకొస్తోంది. మార్కస్ హారిస్, సామ్ కొన్‌స్టాస్, కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ వంటి ఓపెనర్ల పేర్లు పరిశీలించినప్పటికీ, స్థానిక టోర్నీలలో మెరుగైన ప్రదర్శన చేసినందున నాథన్ మెక్‌స్వీనీని ఎంపిక చేశారు.

వివరాలు 

ఇంగ్లిస్‌కు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇదే తొలి అవకాశం.

ఇక జట్టులో మరో కొత్త ఆటగాడు జోష్ ఇంగ్లిస్ కూడా ఉన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నిరంతర స్ధాయిలో రాణిస్తున్న ఈ వికెట్ కీపర్-బ్యాటర్, అలెక్స్ కేరీకి ప్రత్యామ్నాయంగా ఎంపికయ్యాడు. ఇంగ్లిస్‌కు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇదే తొలి అవకాశం. అయితే, తొలి జట్టులో చోటు దక్కడం కష్టమేనని చెప్పవచ్చు. నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఈ తొలి టెస్ట్ ఆసక్తికరంగా మారనుంది. తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు: కమిన్స్‌ (కెప్టెన్‌), ఖవాజా, మెక్‌స్వీనీ, హెడ్, స్టీవ్‌ స్మిత్, లబుషేన్, కేరీ, మిచెల్‌ మార్ష్, ఇంగ్లిస్, లైయన్, స్టార్క్, హేజిల్‌వుడ్, బోలాండ్‌.