IND Vs AUS: జస్ప్రీత్ బుమ్రా దెబ్బకు కుప్పకూలిన ఆసీస్.. 104 పరుగులకు ఆలౌట్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై పైచేయి సాధించారు. ఆస్ట్రేలియాను మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 104 పరుగులకే ఆలౌట్ చేశారు. ఓవర్‌నైట్ స్కోరు 67/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ను భారత పేసర్లు మరింత ఒత్తిడిలోకి నెట్టారు. అలెక్స్ కేరీ (21) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔటవగా, మిచెల్ స్టార్క్ (26: 112 బంతుల్లో 2 ఫోర్లు) తన శక్తి మేర భారత బౌలర్లను ఎదుర్కొనాడు. చివర్లో హేజిల్‌వుడ్ (6)తో కలిసి పదో వికెట్‌కు 25 విలువైన పరుగులు రాబట్టాడు. అయితే లంచ్ బ్రేక్‌కి ముందు హర్షిత్ రాణా బౌలింగ్‌లో స్టార్క్ భారీ షాట్‌కి ప్రయత్నించి రిషభ్ పంత్ అందించిన అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు.
20 వికెట్లు తీసిన పేసర్లు
ఈ మ్యాచ్‌లో మొత్తం 20 వికెట్లూ పేసర్లకే దక్కడం ప్రత్యేకత. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 5, హర్షిత్ రాణా 3, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. జస్‌ప్రీత్ బుమ్రా టెస్టుల్లో 11వసారి ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం విశేషం. ఆసీస్ గడ్డపై ఇది రెండోసారి కావడం విశేషం. ఈ టెస్టు మ్యాచ్ పేస్ బౌలింగ్ ప్రాముఖ్యతను మరోసారి స్పష్టంగా చాటిచెప్పింది.