Page Loader
WTC Final 2025: రవసత్తరంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌.. రెండో రోజూ బౌలర్ల జోరు 
రవసత్తరంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌.. రెండో రోజూ బౌలర్ల జోరు

WTC Final 2025: రవసత్తరంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌.. రెండో రోజూ బౌలర్ల జోరు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ మూడో రోజే ముగిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు బౌలర్లే పైచేయి సాధిస్తున్న ఈ పోరులో ఆస్ట్రేలియా 218 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సరికి ఆ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. మిచెల్‌ స్టార్క్‌ (16), నాథన్‌ లైయన్‌ (1) క్రీజులో ఉన్నారు. అలెక్స్‌ కేరీ 43 పరుగులతో ఒంటరిగా పోరాడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ (3/44), ఎంగిడి (3/35) చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో కమిన్స్‌ (6/28) అద్భుతంగా రాణించడంతో దక్షిణాఫ్రికా కేవలం 138 పరుగులకే ఆలౌటయ్యింది.

వివరాలు 

దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి కంగారూల పతనం

సఫారీ ఇన్నింగ్స్‌లో బెడింగ్‌హమ్‌ (45), బవుమా (36) మాత్రమే కొంత మెరుగైన ప్రదర్శన చేశారు. ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాను 150లోపే కట్టడి చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా,రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సఫారీ పేసర్ల ధాటికి తడబడింది. పేస్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై వరుసగా వికెట్లు కోల్పోయింది. ప్రారంభంలో 28/0తో మెరుగ్గానే ఆరంభించిన ఆసీస్‌.. ఆ తర్వాత ఒక్కసారిగా కుదేలైంది. రబాడ, ఎంగిడి వరుస విజయాలతో కేవలం 45 పరుగుల తేడాతో 7 వికెట్లు కోల్పోయింది. రబాడ ఒకే ఓవర్‌లో ఖవాజా (6), గ్రీన్‌ (0)లను ఔట్‌ చేసి ఆటను తిరగరాసాడు.

వివరాలు 

అలెక్స్‌ కేరీ, స్టార్క్‌ 61 పరుగుల విలువైన భాగస్వామ్యం

అనంతరం ఎంగిడి కూడా దూకుడు చూపించాడు. లబుషేన్‌ (22), స్టీవ్‌ స్మిత్‌ (13), వెబ్‌స్టర్‌ (9), కమిన్స్‌ (6)లను పెవిలియన్‌ చేర్చాడు. ముల్డర్‌ (1/14), యాన్సన్‌ (1/31) తమ పాత్రను పోషించడంతో ఆసీస్‌ 73 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కనీసం 100 పరుగులు సాధ్యమవుతాయా? అన్న సందేహం నెలకొంది. కానీ అలెక్స్‌ కేరీ, స్టార్క్‌లు కలిసి ఒంటిచేత్తో జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరి మధ్య 61 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొనడంతో స్కోరు 100ను దాటి, మొత్తం ఆధిక్యం 200 మార్కును దాటింది. చివర్లో కేరీని రబాడ ఔట్‌ చేశాడు.

వివరాలు 

కమిన్స్‌ నిప్పులు:

ఓవర్‌నైట్‌ స్కోరు 43/4తో రెండో రోజు తమ తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా,ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ ధాటికి తక్కువ స్కోరుకే ఆలౌటైంది. నిప్పులు చెరిగే బౌలింగ్‌ చేసిన కమిన్స్‌ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. రెండో రోజు దక్షిణాఫ్రికా కోల్పోయిన 6 వికెట్లలో 5ను కమిన్స్‌ సాధించడం అతని ప్రదర్శనకు నిదర్శనం. తొలి రోజు నాలుగు వికెట్లు కోల్పోయిన సఫారీ జట్టును కెప్టెన్‌ బవుమా (ఓవర్‌నైట్‌ 3),బెడింగ్‌హమ్‌ (ఓవర్‌నైట్‌ 8) నిలబెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 94/4 వరకూ జట్టును నిలబెట్టారు. అయితే కమిన్స్‌ వేసిన ఫుల్‌ లెంగ్త్‌ బంతిని డ్రైవ్‌ చేయబోయిన బవుమా క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ భాగస్వామ్యంతో 64 పరుగుల ఐదో వికెట్‌కు తెరపడింది.

వివరాలు 

12 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు

ఆపై బెడింగ్‌హమ్‌, వెరీన్‌ (13) జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశారు. లంచ్‌ సమయానికి స్కోరు 125/5. అయితే విరామ సమయంలో వర్షం రావడం, ఆ తర్వాత కమిన్స్‌ మరింత అగ్రెసివ్‌గా బౌలింగ్‌ చేయడం మ్యాచ్‌ దిశను మార్చేశాయి. లంచ్‌ తర్వాత కేవలం 4.1 ఓవర్లలో 4 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన కమిన్స్‌, దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. ఈ సమయంలో దక్షిణాఫ్రికా 12 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయి 150 లోపు ఆలౌట్‌ అయింది. బెడింగ్‌హమ్‌, వెరీన్‌, యాన్సన్‌ (0), రబాడ (1)లతో పాటు కేశవ్‌ మహరాజ్‌ (7) రనౌట్‌ అయ్యాడు.

వివరాలు 

రికార్డుల్లో కమిన్స్‌

రబాడను ఔట్‌ చేయడం ద్వారా కమిన్స్‌ తన టెస్టు కెరీర్‌లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఐసీసీ టోర్నీ ఫైనల్లో 5 వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా (6/28) కమిన్స్‌ రికార్డు సృష్టించాడు. బెడింగ్‌హమ్‌ను ఔట్‌ చేయడం ద్వారా అతడు ఐదో వికెట్‌ సాధించాడు.

వివరాలు 

బెడింగ్‌హామ్‌ ఇలా చేశాడని.. 

లంచ్‌కు ముందు డేవిడ్‌ బెడింగ్‌హమ్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వెబ్‌స్టర్‌ వేసిన షార్ట్‌ బంతి అతడి బ్యాట్‌ను తాకి ప్యాడ్‌లో ఇరుక్కొంది.బంతి పూర్తిగా ఇరుక్కోవకముందే కిందకు జారిపోతున్న సమయంలో అతడు దాన్ని చేతితో పట్టుకుని నేలపై వేసాడు. వికెట్‌కీపర్‌ అలెక్స్‌ కేరీ వెంటనే 'హ్యాండిల్డ్‌ ద బాల్‌' నిబంధనపై అప్పీల్‌ చేశాడు. అయితే బంతి డెడ్‌ అయిందని అంపైర్లు నాటౌట్‌ అని తీర్పు ఇచ్చారు. క్రికెట్‌ నియమాల ప్రకారం బంతి బ్యాటర్‌ ప్యాడ్‌లో ఇరుక్కుంటే అది డెడ్‌ బాల్‌ అవుతుంది. ఆ సమయంలో బ్యాటర్‌ పట్టుకున్నా ఔట్‌ కాకపోవచ్చు.కానీ బంతి ఇంకా కదులుతున్న సమయంలో బెడింగ్‌హమ్‌ దాన్ని పట్టుకోవడం వల్ల అతడు ఔట్‌ అయినట్టే అంటున్నారు కొందరు విశ్లేషకులు.

వివరాలు 

తొలి ఇన్నింగ్స్‌ స్కోర్ 

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 212 దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: మార్‌క్రమ్‌ (బి) స్టార్క్‌ 0; రికిల్‌టన్‌ (సి) ఖవాజా (బి) స్టార్క్‌ 16; ముల్డర్‌ (బి) కమిన్స్‌ 6; బవుమా (సి) లబుషేన్‌ (బి) కమిన్స్‌ 36; స్టబ్స్‌ (బి) హేజిల్‌వుడ్‌ 2; బెడింగ్‌హమ్‌ (సి) కేరీ (బి) కమిన్స్‌ 45; వెరీన్‌ ఎల్బీ (బి) కమిన్స్‌ 13; యాన్సెన్‌ (సి) అండ్‌ (బి) కమిన్స్‌ 0; కేశవ్‌ మహరాజ్‌ రనౌట్‌ 7; రబాడ (సి) వెబ్‌స్టర్‌ (బి) కమిన్స్‌ 1; ఎంగిడి నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (మొత్తం 57.1 ఓవర్లలో ఆలౌట్‌) 138;

వివరాలు 

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌:

లబుషేన్‌ (సి) వెరీన్‌ (బి) యాన్సెన్‌ 22; ఖవాజా (సి) వెరీన్‌ (బి) రబాడ 6; గ్రీన్‌ (సి) ముల్డర్‌ (బి) రబాడ 0; స్మిత్‌ ఎల్బీ (బి) ఎంగిడి 13; హెడ్‌ (బి) ముల్డర్‌ 9; వెబ్‌స్టర్‌ ఎల్బీ (బి) ఎంగిడి 9; కేరీ ఎల్బీ (బి) రబాడ 43; కమిన్స్‌ (బి) ఎంగిడి 6; స్టార్క్‌ బ్యాటింగ్‌ 16; లైయన్‌ బ్యాటింగ్‌ 1; ఎక్స్‌ట్రాలు 19 మొత్తం: (40 ఓవర్లలో 8 వికెట్లకు) 144