AUS win World Cup: భారతీయుల ఆశలు ఆవిరి.. వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి
కోట్లాది మంది భారతీయుల గుండెలు బద్ధలు అయ్యాయి. టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని ఆశపడ్డ అభిమానులు ఆశలు ఆవిరయ్యాయి. 2003 నాటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫలితం నరేంద్ర మోదీ స్టేడియంలో మళ్లీ పునరావృతం అయ్యింది. ప్రపంచ కప్- 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీ(137), లబుషేన్ అర్ధ సెంచరీ(58)తో ఆస్ట్రేలియా సునాయసంగా ఆరోసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. 7ఓవర్లకు మూడు వికెట్లు పడిపోయి కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియాను లబుషెన్‌తో కలిసి ట్రావిస్ హెడ్ అద్భుత ఆట తీరును కనబర్చాడు. ఆ తర్వాత ఒక్క వికెట్ కూడా పడిపోకుండా, ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు.
మ్యాచ్‌ను ఏకపక్షం చేసిన ట్రావిస్ హెడ్
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టీమిండియాకు రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ భారత్‌కు శుభారంభం అందించారు. రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ రాణించడంతో టీమిండియా అతి కష్టం మీద 240 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 241 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. పరుగుల వేటలో తొలి బంతికే డేవిడ్ వార్నర్ క్యాచ్‌ను భారత్ చేజార్చుకుంది. 7ఓవర్లు పూర్తయ్యే నాటికి ఆస్ర్టేలియా 47/3 పరుగులతో పీకల్లోతు ఉంది. ఆ తర్వాత ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ అద్భుత ఆటతీరుతో అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. 43ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 241 పరుగుల లక్ష్యాన్ని పూర్తి ఆరోసారి ప్రపంచ కప్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది.