Babar Azam: విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన బాబర్ అజామ్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20)టోర్నీలో డెసర్ట్ వైపర్స్ తరఫున అరంగేట్రం చేసిన అతడు.. తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకంతో మెరిశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. షార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెసర్ట్ వైపర్స్ ఆరు వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. ఈ పోరులో బాబర్ అజామ్ 51 బంతుల్లో 86 పరుగులు చేశాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యధికసార్లు 80 ప్లస్ స్కోర్లు సాధించిన బ్యాటర్ల జాబితాలో కోహ్లిని వెనక్కి నెట్టాడు. బాబర్‌కు ఇది 31వ 80ప్లస్ స్కోరు కాగా.. కోహ్లి ఇప్పటివరకు 30 సార్లు ఈ ఘనత సాధించాడు.
వివరాలు
80 ప్లస్ స్కోర్లలో సంయుక్తంగా రెండో స్థానం
ఈ జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ 48 సార్లు 80 ప్లస్ స్కోర్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
బాబర్ అజామ్, జోస్ బట్లర్, జేమ్స్ విన్స్, డేవిడ్ వార్నర్ తలో 31 సార్లు ఈ ఘనత సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.
విరాట్ కోహ్లి 30 స్కోర్లతో మూడో స్థానానికి పరిమితమయ్యాడు.
టీ20ల్లో అత్యధిక 80 ప్లస్ స్కోర్లు
48 - క్రిస్ గేల్
31 - బాబర్ అజామ్
31 - జోస్ బట్లర్
31 - జేమ్స్ విన్స్
31 - డేవిడ్ వార్నర్
30 - విరాట్ కోహ్లి
వివరాలు
డెసర్ట్ వైపర్స్ తరఫున రెండో అత్యధిక స్కోరు
ఈ మ్యాచ్‌తో బాబర్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ILT20లో డెసర్ట్ వైపర్స్ తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు.
ఈ జాబితాలో అమెరికా బ్యాటర్ ఆండ్రీ గౌస్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2025 సీజన్‌లో ముంబై ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు 58 బంతుల్లో అజేయంగా 120 పరుగులు చేశాడు.
ఈ టోర్నీలో డెసర్ట్ వైపర్స్ తరఫున సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా కూడా గౌస్ కొనసాగుతున్నాడు.
ఇక ILT20లో ఒక ఇన్నింగ్స్‌లో 80 ప్లస్ స్కోరు సాధించిన 21వ బ్యాటర్‌గా బాబర్ నిలిచాడు.
వివరాలు
ఆరు వికెట్ల తేడాతో డెసర్ట్ వైపర్స్ విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన షార్జా వారియర్స్ 20 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. పాల్ వాల్టర్ 43 బంతుల్లో 75 పరుగులతో అర్ధశతకం సాధించగా.. జేమ్స్ విన్స్ 23 పరుగులు చేశాడు.
డెసర్ట్ వైపర్స్ బౌలర్లలో కెప్టెన్ షాదాబ్ ఖాన్, ఖుజైమా తన్వీర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. టామ్ కర్రన్ రెండు వికెట్లు తీశాడు.
అనంతరం 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డెసర్ట్ వైపర్స్ 17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బాబర్ అజామ్ 51 బంతుల్లో 86 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
జో క్లార్క్ 35 పరుగులతో రాణించాడు. షార్జా వారియర్స్ బౌలర్ ఆడమ్ మిల్నే రెండు వికెట్లు పడగొట్టాడు.