ప్రపంచ వన్డే క్రికెట్లో బాబర్ ఆజం జోరు.. 50వ అర్థశతకం బాదిన పాక్ కెప్టెన్
ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నెలో దక్షిణాఫ్రికాతో పాకిస్థాన్ పోరు కొనసాగుతోంది. 26వ మ్యాచ్‌లో భాగంగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజం అర్థసెంచరీతో చెలరేగాడు. దీంతో వన్డేల్లో అర్ధ సెంచరీని 50 సార్లు నమోదు చేసిన ఘనత వహించాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో ఇది మూడో హాఫ్ సెంచరీ. 65 బంతుల్లో 50 పరుగులు (4 ఫోర్లు, 1 సిక్స్) తర్వాత తబ్రైజ్ షమ్సీ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో పాక్ తరఫున 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఎనిమిదో బ్యాటర్‌గా బాబర్ నిలిచాడు. బాబర్ ఖాతాలో 31 అర్ధసెంచరీలు, 19 సెంచరీలున్నాయి. పాక్ తరఫున అన్వర్ (20) మాత్రమే ఎక్కువ సెంచరీలు చేశాడు.
రెండో అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా బాబర్ ఆజం
111వ వన్డే ఇన్నింగ్స్‌లో 19 వన్డే సెంచరీలు చేసిన బాబర్, రెండో అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా నిలవనున్నాడు. ఈ ఫీట్ సాధించేందుకు కోహ్లీ 133 ఇన్నింగ్స్‌లు తీసుకోగా, దక్షిణాఫ్రికాకి చెందిన హషీమ్ ఆమ్లా 20 సెంచరీలను 108 ఇన్నింగ్స్ ల్లోనే చేధించాడు. మరోవైపు బాబర్ వన్డేల్లో అత్యంత వేగంగా 5,000 పరుగులను అధిగమించిన బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం 97 ఇన్నింగ్స్‌లలో 5,000 ODI పరుగులను సాధించాడు. 114వ ODI మ్యాచ్‌ని ఆడుతున్న బాబర్ 56 సగటుతో 5,616 పరుగుల మైలురాయికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే 88 స్ట్రైక్ రేట్‌ను కొనసాగిస్తున్నాడు. దక్షిణాఫ్రికాపై 4 అర్థసెంచరీలు, ఓ సెంచరీతో 63.66 సగటుతో కొనసాగుతున్నాడు. తాజా అర్ధశతకంతో దక్షిణాఫ్రికాపై మొత్తంగా 573 పరుగులు చేసినట్టైంది.