Babar Azam: బాబర్ అజామ్‌పై సెలక్షన్ కమిటీ నిర్ణయం..పీసీబీని హెచ్చరించిన రమీజ్ రజా
ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులకు పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్‌ను పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. సెలక్షన్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై పలు విమర్శలు వస్తున్నాయి. పాక్ క్రికెట్‌కు ఇది మంచిది కాదని పలువురు హితవు పలుకుతున్నారు. పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రజా కూడా ఈ నిర్ణయంపై తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడు పాక్ క్రికెట్‌కి బ్రాండ్ అని, ఈ చర్య స్పాన్సర్‌షిప్‌లపై ప్రభావం చూపుతుందని పీసీబీని హెచ్చరించాడు.
స్టార్ ఆటగాళ్ల లేకపోవడం జట్టుకు గట్టి ఎదురుదెబ్బ
''జట్టులో బాబర్ లేకపోవడం సరికాదు. అతడు పాక్ క్రికెట్‌కు కీలక ఆటగాడు, అలాగే డబ్బును తెచ్చిపెట్టే బ్రాండ్. అతడికి విశ్రాంతి అవసరమన్నది సాధారణ అభిప్రాయం, కానీ అతడిని పూర్తిగా జట్టుకి దూరం చేయడం అనాలోచిత నిర్ణయం'' అని రమీజ్ రజా ఒక క్రీడా ఛానల్‌తో అన్నారు. బాబర్ మాత్రమే కాకుండా, షాహిన్‌షా అఫ్రిది,నషీమ్ షాలు కూడా జట్టులో లేరని రమీజ్ పేర్కొన్నారు. వీరి గైర్హాజరీతో ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో స్టార్ ఆటగాళ్ల లేకపోవడం జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అనీ, స్పాన్సర్‌షిప్ కోణంలో కూడా ఇది మంచిది కాదని అన్నారు. ''ప్రస్తుతం పాక్ జట్టులో స్టార్ ఆటగాళ్లు ఎవరూ కనిపించడం లేదు.పాకిస్థాన్ వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతోంది,ఇది స్పాన్సర్లపై ప్రభావం చూపుతోంది'' అని రమీజ్ అభిప్రాయపడ్డారు.
హారిస్ రఫూఫ్ కమ్రాన్‌ను చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్
జట్టు కెప్టెన్ షాన్ మసూద్ కూడా ఈ అంశంపై స్పందించారు. టాస్ సమయంలో ముగ్గురు ప్రధాన ఆటగాళ్లు లేని లోటును అంగీకరించి, కొన్ని విషయాలు తన నియంత్రణకు మించి ఉన్నాయని చెప్పారు. అయితే, జట్టు సానుకూలంగా ముందుకు సాగుతుందని చెప్పారు. ఇక, బాబర్ అజామ్ స్థానంలో వచ్చిన కమ్రాన్ గులామ్ తన అరంగేట్ర టెస్టులోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అతడు 118 పరుగులు సాధించి పాకిస్థాన్‌ను గౌరవప్రదమైన స్కోరు వరకు చేర్చాడు. ఈ ప్రదర్శనతో కమ్రాన్ ప్రశంసలు అందుకుంటున్నాడు. మరోవైపు, గతంలో పీఎస్‌ఎల్ మ్యాచ్‌లో హారిస్ రఫూఫ్ కమ్రాన్‌ను చెంపదెబ్బ కొట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.