BCCI: బీసీసీఐ సహాయం కోరిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సహకారం పొందేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తమ ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ బీసీసీఐకి లేఖ రాసి, తమ ఆసక్తిని వెల్లడించింది. గతంలో ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా, ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనలేకపోయింది. అదే ప్రభావంతో ఐపీఎల్‌లో కూడా ఆ దేశానికి చెందిన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఎంపిక చేయలేదు.
వివరాలు
భారత్ సాయం అవసరం..
ఈ పరిస్థితుల్లో మళ్లీ బీసీసీఐ సహకారం కోరుతూ బీసీబీ లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వివరాలను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ నజ్ముల్ అబేదిన్ వెల్లడించారు. అబేదిన్ మాట్లాడుతూ.. తాము బీసీసీఐకి పంపిన లేఖలో ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణపై ప్రస్తావించినట్లు తెలిపారు. సెప్టెంబర్ నెలలో టీమ్ ఇండియా బంగ్లాదేశ్ పర్యటనకు రావాలని కోరామని పేర్కొన్నారు. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం తమ జట్టు భారత్‌కి వెళ్లాల్సి ఉందన్నారు. బంగ్లాదేశ్‌కు సహకారం అందించే అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
వివరాలు
అలా చేస్తే మెరుగైన సంబంధాలు..
ఇటీవల బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత, భారత్‌తో సంబంధాలు కొంత మెరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7, 8వ తేదీల్లో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఖలిలుర్ రహ్మాన్ భారత్ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాల పాటు క్రికెట్ సహకారం అంశంపై కూడా చర్చలు జరిగే అవకాశముంది. బంగ్లాదేశ్ సహకారం కోరుతూ రాసిన లేఖ గురించి నెట్టింట కామెంట్లు వైరల్ అవుతున్నాయి.