BAN vs AUS : ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం.. 36 ఏళ్ల వన్డే చరిత్రలో రెండో గెలుపు
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఢాకా వేదికగా జరిగిన మూడు వన్డేల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను డక్‌వర్త్-లూయిస్ విధానం ప్రకారం 86 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. బ్యాటింగ్ విభాగంలో మొసద్దెక్ హొస్సేన్ అద్భుత ప్రదర్శన చేస్తూ 70 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో అజేయంగా 86 పరుగులు చేశాడు. నజ్ముల్ హుస్సేన్ శాంటో 86 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 67 పరుగులు నమోదు చేశాడు.
వివరాలు
అద్భుత ఇన్నింగ్స్ సాగిందిలా..
ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు పడగొట్టగా, లియామ్ స్కాట్, మాట్ రెన్‌షా చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. జేవియర్ బార్ట్‌లెట్ ఒక వికెట్ సాధించాడు. 285 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసిన సమయంలో వర్షం అంతరాయం కలిగించింది. కొంతసేపు పరిస్థితిని పరిశీలించిన అంపైర్లు ఆటను కొనసాగించడం సాధ్యం కాదని నిర్ణయించి, డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్‌ను విజేతగా ప్రకటించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో కామెరూన్ గ్రీన్ 66 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 52 పరుగులు చేసి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
వివరాలు
ఆసీస్‌ను మట్టికరిపించి విజయం..
అలెక్స్ కేరీ 62 బంతుల్లో 5 ఫోర్లతో 47 పరుగులు చేసి పోరాడాడు. అయితే ఇతర బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో నహిద్ రాణా నాలుగు వికెట్లు తీసి ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. ముస్తాఫిజుర్ రెహమాన్, మొసద్దెక్ హొస్సేన్ చెరో రెండు వికెట్లు సాధించగా, టాస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంతో బంగ్లాదేశ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ గెలవడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. అంతకుముందు 2005లో కార్డిఫ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి బంగ్లాదేశ్ తొలి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు మరోసారి ఆసీస్‌ను మట్టికరిపించి తన సత్తాను చాటుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్ ఇదే..
Bangladesh won by 86 runs (DLS Method) | Dutch-Bangla Bank Bangladesh 🆚Australia ODI Series 2026!
— Bangladesh Cricket (@BCBtigers) June 9, 2026
1st ODI | 9th June 2026 | 11:00 AM (BST)
SBNCS, Dhaka#BCB #Tigers #Bangladesh #Cricket #ODI #Australia pic.twitter.com/aQ3q78vpiE