BCCI Deadline: గంభీర్‌కు బీసీసీఐ డెడ్‌లైన్.. కోచ్ పదవిపై కీలక నిర్ణయం రాబోతోందా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై కేంద్రీకృతమైంది. ఇటీవలే భారత్ స్వగృహంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అవమానం ఎదుర్కొంది. ఆ శోచనీయ పరిస్థితి నుంచి కోలుకుంటున్న తరుణంలోనే సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను కూడా 0-2 తేడాతో కోల్పోవడంతో అభిమానుల్లో ఆగ్రహం ఉధృతంగా వ్యక్తమవుతోంది. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన 16 నెలల వ్యవధిలో భారత్ మూడు టెస్ట్ సిరీస్‌లను కోల్పోవడం విమర్శలకు మరింత ఊపునిచ్చింది. ఇప్పటి వరకు టీమిండియా 19 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా కేవలం 7 విజయాలు మాత్రమే సాధించింది. 10 టెస్టుల్లో పరాజయం చవిచూసి, రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
Details
గంభీర్ రాజీనామా చేయాలంటూ నినాదాలు
ఈ గణాంకాలు గంభీర్‌పై విమర్శలను మరింత పెంచాయి. ఇటీవల గువాహటి టెస్ట్ అనంతరం కొందరు అభిమానులు మైదానంలోనే గంభీర్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేయడం పరిస్థితి ఎంత తీవ్రమైందో చూపిస్తోంది. అయితే మరోవైపు గంభీర్‌కు వ్యతిరేకంగా విమర్శలు విస్తరిస్తున్నా, బీసీసీఐ మాత్రం కోచ్‌కు అండగా నిలుస్తోంది. తాజా ఓటమిపై స్పందించిన బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. బీసీసీఐ ఎలాంటి నిర్ణయాలు తొందరపాటుతో తీసుకోదు. ప్రస్తుతం టీమ్‌ఇండియా మార్పు దశలో ఉంది. వరల్డ్‌కప్ సమీపిస్తున్న నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో ఇప్పుడే ఎటువంటి సంచలన నిర్ణయం తీసుకునే ప్రశ్నే లేదు. ఆయన కాంట్రాక్ట్ 2027 వరల్డ్‌కప్ వరకు కొనసాగుతుందని ఒక ఉన్నతాధికారి తెలిపారు.