LOADING...
BCCI: విదేశీ ప్లేయర్లు అందుబాటులో లేకపోతే రెండేళ్ల నిషేధం..వారికి షాకిచ్చిన బీసీసీఐ
విదేశీ ప్లేయర్లు అందుబాటులో లేకపోతే రెండేళ్ల నిషేధం..వారికి షాకిచ్చిన బీసీసీఐ

BCCI: విదేశీ ప్లేయర్లు అందుబాటులో లేకపోతే రెండేళ్ల నిషేధం..వారికి షాకిచ్చిన బీసీసీఐ

వ్రాసిన వారు Moogati Shabari
Jun 14, 2026
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించింది. క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం, విదేశీ ఆటగాళ్ల లభ్యత లేదా ఫ్రాంచైజీలతో వారి వ్యవహారాల్లో తాము ప్రత్యక్షంగా జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే రాబోయే వేలానికి ఫ్రాంచైజీల పర్స్ పరిమితిని పెంచాలన్న ప్రతిపాదనను కూడా బీసీసీఐ అంగీకరించలేదు. మరోవైపు, 2027 ఐపీఎల్ సీజన్‌ను సాధారణం కంటే ముందుగానే ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా, 2028 నుంచి టోర్నీలో మ్యాచ్‌ల సంఖ్యను పెంచే అంశంపైనా చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

వివరాలు

విదేశీ ఆటగాళ్ల అందుబాటు.. ఫ్రాంచైజీలే చూసుకోవాలి

ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో విదేశీ ఆటగాళ్ల అందుబాటు విషయంలో కొన్ని ఫ్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సమస్యపై బీసీసీఐ చర్యలు తీసుకోవాలని కూడా కోరాయి. అయితే, ఆటగాళ్లు, ఫ్రాంచైజీల మధ్య మధ్యవర్తిగా వ్యవహరించే ఆలోచన తమకు లేదని బోర్డు స్పష్టం చేసింది. వేలంలో ఒక ఫ్రాంచైజీ ఎంపిక చేసిన విదేశీ ఆటగాడు, గాయం మినహా ఇతర కారణాలతో సీజన్‌కు అందుబాటులో లేకపోతే, అతనిపై రెండేళ్ల నిషేధం విధించే నిబంధన కొనసాగుతుందని బీసీసీఐ గుర్తుచేసింది. అయితే గాయం కారణంగా టోర్నీకి దూరమైతే ఎలాంటి శిక్షాత్మక చర్యలు ఉండవని తెలిపింది.

వివరాలు

పర్స్ పరిమితి పెంపుపై తొందరపడని బోర్డు..

ప్రస్తుతం ఐపీఎల్ వేలంలో ప్రతి ఫ్రాంచైజీకి రూ.125 కోట్ల పర్స్ పరిమితి ఉంది. దీనిని మరింత పెంచాలని కొన్ని వర్గాల నుంచి డిమాండ్లు వచ్చినప్పటికీ, బీసీసీఐ వెంటనే పెద్దఎత్తున పెంపు చేయాలనే ఆలోచనలో లేదు. యూరోపియన్ ఫుట్‌ బాల్ లీగ్‌లు లేదా అమెరికన్ ఎన్‌ఎఫ్‌ఎల్ తరహాలో భారీ మొత్తాలను ఒకేసారి అమలు చేయడం సరైన విధానం కాదని బోర్డు అభిప్రాయపడుతోంది. అవసరాన్ని బట్టి దశలవారీగా పర్స్ విలువను పెంచే అవకాశాన్ని మాత్రమే పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

Advertisement

వివరాలు

2027 ఐపీఎల్ ముందుగానే ప్రారంభించే యోచన..

ఈ ఏడాది ఐపీఎల్ మార్చి చివర్లో ప్రారంభమై మే 31తో ముగిసింది. అయితే 2027లో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో, ఆ సీజన్‌ను సాధారణ షెడ్యూల్ కంటే ముందుగానే ప్రారంభించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదేవిధంగా, 2028 సీజన్ నుంచి మ్యాచ్‌ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 74 నుంచి 94కు పెంచే అంశంపైనా చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే టోర్నీని మార్చి మొదటి వారంలోనే ప్రారంభించాల్సి రావచ్చని భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్‌లకు కూడా క్రికెట్ క్యాలెండర్‌లో తగిన స్థానం కల్పించాల్సిన అవసరం ఉండటంతో, రెండున్నర నెలలకుపైగా సమయాన్ని ఐపీఎల్‌కు కేటాయించడం సవాలుగా మారుతోంది.

Advertisement