కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ హోదా తొలగింపు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. నాగ్ పూర్ టెస్టులో 20 పరుగులు, ఢిల్లీ టెస్టులో 17 పరుగులకే ఔట్ అయి నిరాశపర్చాడు. దీంతో తాజాగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ వైస్ కెప్టెన్సీ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. వైస్ కెప్టెన్ ట్యాగ్ తీసేసి ఇకనైనా రాహుల్‌ను పక్కనపెట్టి.. గిల్‌కు అవకాశం ఇవ్వాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. రాహుల్ ని వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించడం.. శుబ్‌మన్ గిల్ కు తుది జట్టులో చోటిస్తున్నామని చెప్పడానికి ఇది ఒక సూచికని పలువురు భావిస్తున్నారు. 2021లో సెంచూరియన్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో రాహుల్ దక్షిణాఫ్రికాపై చివరి టెస్టు శతకం సాధించాడు.
రాహుల్‌కు మరిన్ని అవకాశాలు కల్పిస్తాం: రాహుల్ ద్రవిడ్
రాహుల్ 2014లో టెస్టు అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అతను 47 మ్యాచ్‌ల్లో 2,642 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 13 అర్ధ సెంచరీలున్నాయి. 2020 చివర్లో అరంగేట్రం చేసిన శుబ్‌మన్ గిల్ 13 మ్యాచ్‌ల్లో 736 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. రాహుల్ 90 ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లు ఆడి 6,539 పరుగులు చేశారు. ఇందులో 17 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలున్నాయి. గిల్ 40 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడి 3,278 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 16 అర్ధ సెంచరీలున్నాయి. రాహుల్‌కు భవిష్యతులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశారు.