దేశవాళీ క్రికెట్‌లో బీసీసీఐ కొత్త నిబంధనలు.. ఇకపై ఒక్క ఓవర్లో!
ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ విధానం సక్సెస్ కావడంతో బీసీసీఐ కొత్త పంథాలో టోర్నీలను నిర్వహించేందుకు సిద్ధమైంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కొత్త రూల్స్ ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. ఇప్పటివరకూ టీ20 క్రికెట్లో ఓవర్‌కు ఒకే బౌన్సర్ మాత్రమే వేసే అవకాశం బౌలర్లకు ఉండేది. ఈ రూల్‌లో మార్పులు చేసిన బీసీసీఐ ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లు వేసేలా కొత్త నియమాన్ని అమల్లోకి తీసుకురానుంది. శుక్రవారం ముంబాయిలో అపెక్స్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో పాటు రెండు బౌన్సర్లకు సంబంధించిన రూల్ కోసం బీసీసీఐ అనుమతి ఇచ్చింది.
అక్టోబర్ 16 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ
ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ద్వారా ఈ కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా టీ20ల్లో బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలో రెండు బౌన్సర్ల రూల్ ద్వారా బౌలర్ల ప్రభావం పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలిసింది. ఈ రూల్స్ బీసీసీఐ త్వరలో ప్రవేశపెట్టనుంది 2023-24 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ అక్టోబర్ 16 నుంచి ఆరు వరకు జరగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 38 జట్లు తలపడనున్నాయి.