IPL 2025 Auction RTM Card: ఐపీఎల్ 2025 రిటెన్షన్ రూల్స్ లీక్.. ఒక్కో ఫ్రాంఛైజీ ఐదుగుర్ని రిటైన్ చేసుకోవచ్చు..!
ఈ ఏడాది చివరలో జరిగే ఐపీఎల్ 2025 వేలంపై ఆసక్తి పెరుగుతోంది, ఎందుకంటే ఇది ఒక మెగా వేలం. ఈ నేపథ్యంలో రిటెన్షన్ ఆటగాళ్ల సంఖ్య,ఆర్టీఎం కార్డుపై పలు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ త్వరలో అధికారిక ప్రకటనను విడుదల చేయనుందని వినిపిస్తోంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఒక వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్, ఆర్టీఎం కార్డుల వివరాలు ఉన్నాయి. రెండు నెలల తర్వాత జరిగే ఐపీఎల్ 2025 మెగా వేలంలో భాగంగా, రిటెన్షన్ పాలసీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్దారించింది. ఈ నెల 25న బెంగళూరులో జరిగిన బీసీసీఐ 93వ సాధారణ సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం)ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఐపీఎల్‌లోని 10 ఫ్రాంఛైజీలతో బీసీసీఐ చర్చలు
అయితే, కొన్ని ఫ్రాంఛైజీలు కోరుకున్న ఆర్టీఎం కార్డును బీసీసీఐ తిరిగి అందుబాటులోకి తీసుకొవడానికి అంగీకరించలేదని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఐపీఎల్ 2025 వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది, అయితే దీనిపై అధికారిక ప్రకటన త్వరలో ఉండే అవకాశం ఉంది. కొత్త రిటెన్షన్ పాలసీలో ప్రతి జట్టు గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా లేనట్లుగానే, ఈ సారి కూడా ఆర్టీఎం (రైట్ టు మ్యాచ్) కార్డుకు అవకాశం ఇవ్వబడలేదు. ఇప్పటికే ఐపీఎల్‌లోని 10 ఫ్రాంఛైజీలతో బీసీసీఐ చర్చలు జరిపింది.
8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్
అయితే, బీసీసీఐతో జరిగిన ఫ్రాంఛైజీల సమావేశంలో వేలంపై వివిధ అభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. కొన్ని ఫ్రాంఛైజీల యజమానులు మెగా వేలంపై ఆసక్తిగా ఉన్నారు. కాగా మరికొందరు దీనిని తప్పించాలని భావిస్తున్నారు. ఫ్రాంఛైజీలు కనీసం 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, బీసీసీఐ ఐపీఎల్‌కు క్రేజ్ తగ్గకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఐదు మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే విధంగా నియమాలు రూపొందించినట్లు తెలుస్తోంది.