Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్ వెళ్తుందా? బీసీసీఐ కీలక ప్రకటన
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా, ఈ టోర్నీ కోసం భారత జట్టు దాయాది దేశానికి వెళ్లడంపై సందేహం నెలకొంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగే ఈ టోర్నీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లడంపై కేంద్ర ప్రభుత్వ అనుమతిపై నిర్ణయం ఆధారపడి ఉంటుందని శుక్లా తెలిపారు.
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు..
భారత్ ,పాకిస్తాన్ మధ్య చాలా కాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడంలేదు. రెండు జట్లు ICC టోర్నమెంట్‌లు లేదా ఆసియా కప్ వంటి బహుళజాతి టోర్నమెంట్‌లలో మాత్రమే ఆడుతున్నాయి. భారత్-పాకిస్థాన్ మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ 2012-2013లో జరిగింది.గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడగా అందులో భారత జట్టు విజయం సాధించింది. వచ్చే నెలలో న్యూయార్క్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇరు జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ జరగనుంది. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును పాకిస్తాన్‌కు పంపే ముందు దౌత్య, భద్రతా అంశాలతో సహా అనేక అంశాలు చర్చించబడ్డాయి.
'భారత ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తాం'
భద్రతా సమస్యలు, చరిత్ర దృష్ట్యా, టోర్నమెంట్ కోసం భారతదేశం పొరుగు దేశానికి వెళ్లడంపై ఏదైనా నిర్ణయం, అధికారులతో చర్చించిన తర్వాత మాత్రమే తీసుకోబడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించినంత వరకు, భారత ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తామని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా చెప్పినట్లు వార్తా సంస్థ ANI పేర్కొంది. "ప్రభుత్వం అనుమతిస్తేనే మా బృందాన్ని పంపిస్తాం. భారత ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటాం"అని శుక్లా అన్నారు.
ఆసియా కప్‌కు పాకిస్థాన్ వెళ్లని టీమిండియా
గత సంవత్సరం, ODI ప్రపంచ కప్‌కు ముందు, ఆసియా కప్‌ను పాకిస్థాన్ లో నిర్వహించాల్సి ఉండగా దాయాది దేశానికి వెళ్లడానికి భారత జట్టు నిరాకరించింది. ఆ తర్వాత హైబ్రిడ్ మోడల్‌లో టోర్నమెంట్ నిర్వహించారు. టీమిండియా మ్యాచ్‌లు అన్ని శ్రీలంకలో జరగగా , ఇతర జట్ల మ్యాచ్‌లు పాకిస్థాన్ లో జరిగాయి. అయితే వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ భారత్‌లో పర్యటించింది. ఆసియా కప్ కోసం భారత్ పాకిస్థాన్‌కు రాకపోతే భారత్‌లో పర్యటించబోమని గతంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బెదిరించినప్పటికీ ప్రపంచ స్థాయిలో బోర్డు మద్దతు పొందలేకపోయింది. 2017లో భారత్‌ను ఓడించి పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.