మార్చి 15 నుంచి మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్
టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లోవ్లినా బోర్గోహైన్ తో , ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఐబిఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2023లో బరిలోకి దిగనున్నారు. వచ్చే నెల 15 నుంచి 26 వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో తెలంగాణ యువ కెరటం నిఖత్ జరీన్ భారత జట్టుకు నేతృత్వం వహించనుంది. నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో పోటీ పడనుంది. ఈసారి కూడా విజేతగా నిలవాలని పట్టుదలతో నిఖత్ ఉంది. టోక్సో ఒలంపిక్స్‌లో కాంస్యం నెగ్గిన లవ్లీనా 75 కేజీల విభాగంలో బరిలోకి దిగనుంది.
అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న బాక్సర్లు
బర్మింగ్‌హామ్ 2022 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత నీతు ఘన్‌ఘాస్ కూడా 48 కేజీల విభాగంలో దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. రెండుసార్లు యూత్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె మరోసారి సత్తా చాటాలని భావిస్తోంది. గత కొన్నేళ్లుగా బాక్సర్లు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణిస్తున్నారని బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ పేర్కొన్నారు. ఇక భారత్ నుంచి నీతు, మనిషా, స్వీటీ, సాక్షి చౌదరి మనీషా మౌస్, జాస్మిస్ లంబోరియా, శశిచోప్రా, మంజు బంబోరియా, సనమచ చాను, లవ్లీనా బొర్గోహైస్, సవీటి బూరా, సుపర్ షెరాస్ పోటీ పడనున్నారు.