Harvinder Singh: క్రీడా అవార్డుల్లో పక్షపాతం.. మాపై వివక్ష చూపారు : పారా అథ్లెట్ హర్విందర్ సింగ్
పారిస్ పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన అథ్లెట్ హర్విందర్ సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవి ప్రస్తుతం క్రీడావర్గాల్లో విప్లవాత్మక చర్చలకు కారణమయ్యాయి. ఖేల్ రత్న అవార్డు నామినేషన్లలో తన పేర్లు కనిపించకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన హర్విందర్, క్రీడల్లో తమపై వివక్ష కొనసాగుతున్నారని ఆరోపించాడు. జాతీయ ఆర్చరీ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత జివాన్‌జోత్ సింగ్ తేజ కూడా ఈ వివాదంపై స్పందించారు. టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన వారిని మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుతో సత్కరించారు. కానీ పారిస్ పారాలింపిక్స్‌లో గెలిచిన వారి పరిస్థితి ఏమిటి? అవే పోటీలు, అదే గోల్డ్ పతకం, అదే గౌరవం, కానీ అవార్డు మాత్రం లేదని హర్విందర్ వాపోయారు.
సాధించిన విజయాలను పరిగణలోకి తీసుకోవాలి
2021 టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన అవని లేఖరా, సుమిత్ అంతిల్, ప్రమోద్ భగత్‌లకు ఖేల్ రత్న అవార్డులు ఇచ్చిన విషయం తెలిసిందే. జివాన్‌జోత్ సింగ్ తేజ మాట్లాడుతూ, "టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారితో పాటు, పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ గెలిచినవారిని కూడా ఖేల్ రత్న అవార్డులతో సత్కరించారు. కేంద్రం ఆ సమయంలో తీసుకున్న నిర్ణయం అథ్లెట్లకు ఎంతో ప్రేరణ ఇచ్చింది. నిబంధనలు మారిన సంగతి తనకు తెలుసు అని, అయినా హర్విందర్ సింగ్ విషయంలో ప్రత్యేకంగా అధికారులకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. అతని సాధించిన విజయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.