
Bomb Blast Cricket Stadium: పాకిస్థాన్‌లో క్రికెట్ మైదానంలో బాంబు పేలుడు.. ఒకరి మృతి, పలువురికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బజౌర్ జిల్లాలోని ఖార్ తహసీల్‌లో ఉన్న కౌసర్ క్రికెట్ మైదానంలో ఆట జరుగుతుండగా ఒక్కసారిగా బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. పేలుడు తరువాత మైదానమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఆకస్మికంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో ఆటగాళ్లు, ప్రేక్షకులు భయంతో పరుగులు తీయడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Details
గాయపడిన వారిలో చిన్నారులు
ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ (IED) సహాయంతో ఈ దాడి జరిగిందని బజౌర్ జిల్లా పోలీసు అధికారి వకాస్ రఫీక్ తెలిపారు. మృతుడితో పాటు గాయపడినవారిలో కొంతమంది చిన్నారులు కూడా ఉన్నారని, ప్రస్తుతం వారు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ ఘటనకు వారం ముందు ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఓ పోలీస్ స్టేషన్‌పై క్వాడ్‌కాప్టర్ దాడి జరిగింది. ఆ దాడిలో ఒక కానిస్టేబుల్, ఒక పౌరుడు గాయపడ్డారు. భద్రతా అధికారులు చెబుతున్న ప్రకారం, కొద్ది వారాల క్రితం భద్రతా దళాలు ప్రారంభించిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ 'సర్బకాఫ్'కు ప్రతిస్పందనగా ఉగ్రవాదులు ఈ బాంబు దాడులు జరుపుతున్న అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.