Paris 2024: పారాలింపిక్స్‌లో రికార్డులను సృష్టించిన సుమిత్ యాంటిల్
పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో భారత జావెలిన్ సంచలనం సుమిత్ యాంటిల్ అద్భుతమైన ప్రదర్శనతో వరుసగా స్వర్ణ పతకాలను సాధించాడు. ఈ పోటీలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సుమిత్ అద్భుత్ ప్రదర్శనతో మరోసారి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. సుమిత్ తన 6 త్రోలలో రెండుసార్లు తన స్వంత పారాలింపిక్స్ రికార్డును బద్దలు కొట్టాడు. 69.11 మీటర్ల ఎత్తుకు దూసుకెళ్లి, మొదటి ప్రయత్నంలోనే తన టోక్యో రికార్డును అధిగమించాడు. అనంతరం, 70.59 మీటర్లకు జావెలిన్‌ను విసిరి, మరోసారి రికార్డును బద్దలు కొట్టి అరుదైన ఘనత సాధించాడు.
నిరాశపరిచిన సందీప్, సంజయ్
సుమిత్ మూడో త్రోలో 66.66 మీటర్లు త్రో చేశాడు, నాల్గవ ప్రయత్నంలో త్రో ఫౌల్ కావడంతో లెక్కలోకి రాలేదు. ఐదవ త్రోలో 69.04 మీటర్లు త్రో చేసి, తన స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. ఇక శ్రీలంకకు చెందిన దులన్ కోడితువాక్కు 66.57 మీటర్ల త్రోతో కొంత పోటీ ఇచ్చినా, సుమిత్‌ను అధిగమించలేదు. ఈ పోటీలో ఇండియా తరపున పాల్గొన్న సందీప్, సంజయ్, సుమిత్ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయారు. సందీప్ 62.80 మీటర్లతో నాల్గవ స్థానంలో నిలిచాడు, సంజయ్ 58.03 మీటర్లతో ఏడవ స్థానంలో నిలిచాడు.