బజ్‌బాల్ విధానం సూపర్.. టీమిండియా కూడా దూకుడుగా ఆడాలి: కపిల్ దేవ్
టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ మరోసారి వార్తాలో నిలిచారు. టీమిండియాతో పాటు టెస్టు క్రికెట్ ఆడే జట్లన్నీ ఇంగ్లండ్ మాదిరిగా బజ్ బాల్ క్రికెట్ ను అలవర్చుకోవాలని టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ సూచించాడు. సంప్రదాయ క్రికెట్ లో ఇంగ్లండ్ అనుసరిస్తున్న బజ్‌బాల్ విధానం అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. ఇటీవల తాను చూసిన అత్యుత్తమ టెస్టు సిరీస్‌లలో యాషెస్ సిరీస్ అద్భుతమని చెప్పారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాతో పాటు ఇతర జట్లు అన్ని ఈ విధమైన దూకుడైన ఆటతీరును ఆలవర్చుకోవాలని కపిల్ దేవ్ చెప్పుకొచ్చారు.
సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో ఆడాలి
కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఆటగాడే అని, అయితే అతను మరింత దూకుడుగా ఆడాలని, అన్ని జట్లు డ్రా కోసం కాకుండా విజయం సాధించడం కోసం ప్రయత్నించాలని కపిల్ దేవ్ వెల్లడించారు. ముఖ్యంగా టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో ఆడకపోవడంపై కపిల్ దేవ్ అసహనం వ్యక్తం చేశారు. అగ్రశేణి ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో ఆడితే మంచిదని, ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎన్ని దేశవాళీ మ్యాచులు ఆడారని ప్రశ్నించారు. ఇక టీమిండియా టెస్టు జట్టులో ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ ఉంటే జట్టు సమతూకంగా ఉంటుందని టీమిండియా మాజీలు అభిప్రాయపడ్డారు.