Yuzendra Chahal: బౌలర్ నుంచి బ్యాటర్‌గా మారిన చహెల్.. రంజీ ట్రోఫీలో ఆద్భుత ప్రదర్శన
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహెల్ తాజాగా బ్యాటర్ అవతారం ఎత్తాడు. బౌలింగ్‌తో పేరుగాంచిన చహల్ ఇటీవల రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో బ్యాటింగ్ చేస్తూ అభిమానులను ఆలరించాడు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో 152 బంతుల్లో 48 పరుగులు చేసిన చహల్ తాజాగా మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 142 బంతులు ఆడుతూ 27 పరుగులు చేశాడు. క్రమంగా తన బ్యాటింగ్‌లో స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్న అతన్ని చూసి అభిమానులు 'టీమిండియాకు కొత్త ఆల్‌రౌండర్ దొరికాడా?' అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
బ్యాటింగ్ లో రాణిస్తున్న చాహల్
హర్యానా తరపున రంజీ ట్రోఫీ ఆడుతున్న చహల్, పదో నంబర్ బ్యాటర్‌గా వచ్చినప్పటికీ మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొమ్మిదో నంబర్ బ్యాటర్ హర్షల్ పటేల్ (72 నాటౌట్) తో కలిసి దాదాపు 300 బంతులు ఎదుర్కొన్నాడు. ఇద్దరూ బ్యాటింగ్‌ను చక్కగా నిలబెట్టడంతో, హర్యానా మధ్యప్రదేశ్ పై ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజు ముగిసే సమయానికి హర్యానా 9 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసి, 123 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.