Page Loader
IND vs NZ: నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. దుబాయ్ పిచ్ రిపోర్ట్‌పై లుక్కేయండి!
నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. దుబాయ్ పిచ్ రిపోర్ట్‌పై లుక్కేయండి!

IND vs NZ: నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. దుబాయ్ పిచ్ రిపోర్ట్‌పై లుక్కేయండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 09, 2025
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇవాళ భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సమరం ప్రారంభం కానుంది. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. వరుసగా నాలుగు విజయాలతో ఫైనల్‌‌కు చేరుకుంది. లీగ్ దశలో న్యూజిలాండ్‌ను ఓడించిన భారత జట్టు, రోహిత్ శర్మ నేతృత్వంలో 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Details

పిచ్ స్పిన్నర్లకు అనుకూలం

దుబాయ్‌లోని పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడగా, అందులో స్పిన్నర్లు కీలక భూమిక పోషించారు. గత రెండు మ్యాచ్‌ల్లో భారత జట్టు 'స్పిన్ క్వార్టెట్' వ్యూహాన్ని ప్రయోగించగా, అది విజయవంతమైంది. ముఖ్యంగా, 'మిస్టరీ స్పిన్నర్' వరుణ్ చక్రవర్తి రెండు మ్యాచ్‌ల్లో 7 వికెట్లు పడగొట్టి తన ప్రభావాన్ని చూపాడు. ఫైనల్‌లో కూడా స్పిన్ బౌలర్లకు మద్దతు లభించే అవకాశం ఉంది.

Details

టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం మంచిది

అయితే, పేస్ బౌలర్లను నిర్లక్ష్యం చేయలేం. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, న్యూజిలాండ్‌కు చెందిన మాట్ హెన్రీ దుబాయ్‌లో అద్భుత ప్రదర్శన అందించారు. మరోవైపు ఈ స్టేడియంలో 270 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేజ్ చేయడం కష్టతరం. గత రికార్డులను పరిశీలిస్తే, దుబాయ్‌లో ఎక్కువగా ఛేజింగ్ జట్లు విజయాన్ని సాధించాయి. కాబట్టి, టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడం మంచిదని నిపుణులు భావిస్తున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొత్తం 62 మ్యాచులు జరగ్గా, ఇందులో ఛేజింగ్ జట్లు 37 మ్యాచులు, మొదటి బ్యాటింగ్ చేసిన జట్లు 23 మ్యాచుల్లో గెలుపొందాయి.

Details

హెడ్-టు-హెడ్ రికార్డు 

భారత్-న్యూజిలాండ్ జట్లు ఇప్పటివరకు 119 వన్డేల్లో తలపడగా, భారత్ 61 మ్యాచ్‌ల్లో గెలిచి పైచేయి సాధించింది. న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 7 మ్యాచ్‌లు ఫలితం తేలకుండానే ముగియగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. గత ఐదు వన్డేల్లో భారత్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. 2021 జనవరి 21 నుండి 2024 మార్చి 2 వరకు జరిగిన అన్ని వన్డేల్లో భారత్, కివీస్‌ను ఓడించింది. ఈ నేపథ్యంలో, ఫైనల్ పోరులో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి!