Nara Devansh: 'ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్'గా నారా దేవాంశ్ ఘనత.. వేగంగా 175 పజిల్స్‌కు పరిష్కారం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ కుమారుడు దేవాంశ్ తన ప్రతిభతో ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. అతడు కేవలం తొమ్మిదేళ్ల ప్రాయంలోనే అత్యంత క్లిష్టమైన 175 చెస్ పజిల్స్‌ను వేగంగా పరిష్కరించి 'ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్-175 పజిల్స్' రికార్డును సాధించాడు. ఈ రికార్డుతో పాటు,అతడి మరో రెండు విశేష రికార్డులను లండన్‌లోని 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' అధికారికంగా ధ్రువీకరించింది. 11 నిమిషాలు 59 సెకన్లలో చెక్‌మేట్ పజిల్స్‌ను పూర్తి చేసిన అతడు తన వ్యూహాత్మక నైపుణ్యాలను ప్రదర్శించాడు. ''5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్'' పుస్తకంలోని పజిల్స్‌ను ఉపయోగించి ఈ పోటీ నిర్వహించారు.
లోకేశ్ పుత్రోత్సాహం..
అంతేకాక, దేవాంశ్ 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయ్ పజిల్‌ను 1 నిమిషం 43 సెకన్లలో పూర్తిచేయగా, 9 చెస్‌బోర్డులపై 32 పావులను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. అతడి ఈ విజయాలను న్యాయనిర్ణేతలు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు పరిశీలించి ధ్రువీకరించారు. దేవాంశ్ విజయం పట్ల కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. లోకేశ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో భారత చెస్ క్రీడాకారుల ప్రేరణతో దేవాంశ్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడని చెప్పారు. అతడికి చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు తెలిపారు. దేవాంశ్ కోచ్ కె.రాజశేఖర్‌రెడ్డి అతడి దృఢనిశ్చయాన్ని, రోజుకు 5-6 గంటల శిక్షణతో సాధించిన విజయాన్ని ప్రశంసించారు.
నారా బ్రాహ్మణి అభినందనలు
దేవాంశ్ సాధించిన అద్భుత విజయంపై అతడి తల్లి నారా బ్రాహ్మణి హర్షం వ్యక్తం చేశారు. అతడి అంకితభావం, పట్టుదల ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. దేవాంశ్‌ను విజయవంతంగా ప్రోత్సహించిన కోచ్ కె.రాజశేఖర్‌రెడ్డికి, రాయ్ అకాడమీలకు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రుల అభినందనలు
వివిధ మంత్రులు దేవాంశ్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి దేవాంశ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అతడు భవిష్యత్తులో రాష్ట్రానికీ, దేశానికీ గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా అభినందనలు తెలిపారు.
''నా చిన్న గ్రాండ్‌మాస్టర్'' - చంద్రబాబు ప్రశంస
దేవాంశ్ విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ''నిన్ను చూసి గర్విస్తున్నా నా చిన్న గ్రాండ్‌మాస్టర్'' అంటూ అభినందనలు తెలిపారు. కఠోర శ్రమ, అంకితభావంతో దేవాంశ్ సాధించిన ఈ విజయాన్ని ఆయన ప్రశంసించారు. చదరంగం పజిల్స్ పూర్తి చేసే దేవాంశ్ వీడియోను సోషల్‌మీడియాలో పంచుకున్నారు.