
Irfan Pathan: ఆస్ట్రేలియా కల్చర్ రుద్దకపోతే ఛాపెల్ గొప్ప కోచ్‌గా నిలిచేవాడు: ఇర్ఫాన్ పఠాన్
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు క్రికెట్ చరిత్రలో అత్యంత క్లిష్టమైన దశల్లో ఒకటి అంటే, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం గ్రెగ్ ఛాపెల్ టీమిండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన కాలమే అని అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. అప్పటికే జట్టులో కీలక స్థానంలో ఉన్న సీనియర్ ఆటగాళ్లతో ఆయన ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా కెప్టెన్ సౌరభ్ గంగూలీని సారథ్య బాధ్యతల నుంచి తప్పించడంలో ఛాపెల్ కీలక పాత్ర పోషించాడని అప్పటి సంఘటనలపై ఇప్పటికీ చర్చ సాగుతుంది. ఆ సమయంలో జట్టులో ఉన్న ఇర్ఫాన్ పఠాన్, గ్రెగ్ ఛాపెల్ ప్రవర్తన గురించి తన అనుభవాలను పంచుకున్నాడు. "గ్రెగ్ సీనియర్లనైనా, జూనియర్లనైనా ఒకేలా ట్రీట్ చేసేవాడు. ఎవరు బాగా ఆడకపోతే వారిని జట్టులోంచి తప్పిస్తానని ముందుగానే చెప్పేవాడు.
Details
చివరికి తాను చెప్పిన మాటలే నిజమయ్యాయి
ఆ దూకుడును చూసి ఆశ్చర్యపోయా. ఒకసారి ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడా. 'మేము సరిగా ఆడకపోతే తప్పిస్తారని మాకు తెలుసు, మీరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా చెబితే జట్టులో అభద్రత పెరుగుతుందని అన్నాను. అప్పుడు ఆయన కొద్దిసేపు నావైపు చూశాడు. కొంచెం బాధపడినట్లు అనిపించింది. కానీ చివరికి నేను చెప్పిన మాటలే నిజమని ఆయన గ్రహించాడని ఇర్ఫాన్ గుర్తుచేశాడు. గ్రెగ్ ఛాపెల్ ఉద్దేశం తప్పు కాదని, కానీ భారతీయ సంప్రదాయాలను అర్థం చేసుకోలేకపోయాడని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. "ఒకవేళ నేను శ్రీలంక, బంగ్లాదేశ్ లేదా ఇంగ్లాండ్‌కి కోచ్‌గా వెళ్లి వారి సంస్కృతిని అంగీకరించకపోతే, ఆ ఆటగాళ్లు నన్ను అంగీకరించరా? ఇదే విషయాన్ని గ్రెగ్ విషయంలోనూ చూశామన్నారు.
Details
సంప్రదాయాలను అంగీకరించాలి
అతడి ఉద్దేశం మంచిదే కానీ, భారత్‌లో ఆస్ట్రేలియా కల్చర్‌ను రుద్దాలని ప్రయత్నించాడు. ప్రతి ఒక్కరూ తాను అనుకున్న విధంగానే ఆడాలని భావించాడు. ఆటగాళ్ల బ్యాక్‌గ్రౌండ్ గురించి అసలు పట్టించుకోలేదు. నేను గతంలో మిడిల్ క్లబ్ కోసం ఆడా. అక్కడ నాలుగు రోజుల మ్యాచ్‌కు ముందు జట్టు సభ్యులు ఒక బార్‌లో కలుస్తారు. నేను మద్యం తాగను. అయినా వారి కల్చర్‌లో భాగంగా అక్కడికి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆ జట్టులో ఉన్నప్పుడు ఆ సంప్రదాయాన్ని అంగీకరించాలి. కానీ ఈ ఒక్క విషయంలో గ్రెగ్ సరిగ్గా వ్యవహరించలేకపోయాడు. అతను కాస్త భిన్నంగా ఆలోచించి ఉంటే, భారత క్రికెట్ చరిత్రలో అతను బెస్ట్ కోచ్‌లలో ఒకరిగా మిగిలేవారని ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు.