Chess Olympiad 2024: రోహిత్ శర్మ స్టైల్‌లో చెస్ ఛాంపియన్ల సంబరాలు
చెస్ ఒలింపియాడ్‌లో విజేతలుగా నిలిచి భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల, మహిళల విభాగాల్లో కూడా విజేతలుగా నిలిచిన భారత జట్టు బంగారు పతకాలు సాధించింది. ఈ ఘనతతో చెస్ ప్రపంచంలో భారత్ తన ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించింది. ఈ క్రమంలో చెస్ ఛాంపియన్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అనుకరించారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన సమయంలో రోహిత్ శర్మ ట్రోఫీని అందుకునేందుకు క్యాట్ వ్యాక్ చేస్తూ వస్తాడు. ఇప్పుడు అలాగే చెస్ ప్లేయర్లు గుకేశ్, తానియా సచ్‌దేవ్ కూడా క్యాట్ వ్యాక్ చేస్తూ వచ్చారు.
గౌతమ్ అదానీ ప్రశంసలు
2024 చెస్ ఒలింపియాడ్ విజయం అనంతరం పోడియంపై జాతీయ జెండా రెపరెపలాడిన సమయంలో ఈ సంబరాలు నెట్టింట వైరల్‌గా మారాయి. పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ చెస్ ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించారు. ఇది భారతీయ చెస్ చరిత్రలో కీలక ఘట్టమని, పురుషుల, మహిళల జట్లకు శుభాకాంక్షలని, చెస్ ఒలింపియాడ్‌లో బంగారు పతకాలు సాధించడం అద్భుతమని ఆయన కొనియాడారు. ఈ విజయంలో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు.