
Rajat Patidar: ఛత్తీస్‌గఢ్ వ్యాపారవేత్తకు విరాట్, డివిలియర్స్ నుండి ఫోన్ కాల్స్
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.మ్యాచ్ ఉంటే సరిపోతుంది, స్టేడియాల్లో అభిమానులు గుంపులుగా చేరి సందడి చేస్తారు.తమ అభిమాన క్రికెటర్లకు హర్షధ్వానాలు చేస్తూ ఉత్సాహపరుస్తారు. ఇష్టమైన క్రికెటర్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తారు.అయితే,ఒక యువకుడు మాత్రం ఎలాంటి ప్రయత్నం చేయకుండానే స్టార్ క్రికెటర్ల నుంచి ఫోన్ కాల్స్ అందుకున్నాడు. ముఖ్యంగా రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ కాల్ రావడంతో,ఈ సంఘటన హాట్ టాపిక్‌గా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఒక చిన్న గ్రామంలో నివసించే ఆ యువకుడికి విరాట్ కోహ్లీ,ఏబీ డివిలియర్స్ వంటి ప్రముఖ క్రికెటర్ల నుంచి కాల్స్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొదట ఈ కాల్స్ నకిలీ అనుకున్న ఆ యువకుడు,తరువాత దర్యాప్తులో అవి నిజమైనవని తేలడంతో షాక్ అయ్యాడు.
వివరాలు
విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్ ప్లేయర్స్ నుంచి కాల్స్
ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ జిల్లాలోని దేవ్‌భోగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మడగావ్‌లో నివసించే యువకుడు కొత్త సిమ్ కొనుగోలు చేశాడు. ఆ సిమ్, గతంలో భారత క్రికెటర్ రజత్ పాటిదార్ పేరుతో రిజిస్టర్ అయిన నంబర్‌గా తేలింది. దీని వాడకం 90 రోజులకు పైగా లేకపోవడంతో, టెలికాం కంపెనీ కొత్త కస్టమర్‌కు కేటాయించింది. ఈ కొత్త నంబర్‌తో మనీష్ అనే యువకుడికి విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్ ప్లేయర్స్ నుంచి కాల్స్ రావడం మొదలయ్యింది. దీంతో గ్రామంలో ఇది పెద్ద చర్చనీయాంశమైంది. 21 ఏళ్ల మనీష్ జూన్ 28న జియో సిమ్ కొనుగోలు చేశాడు. సిమ్ యాక్టివేట్ అయిన వెంటనే వాట్సాప్ ఇన్‌స్టాల్ చేయగా, అందులో రజత్ పాటిదార్ డిస్‌ప్లే పిక్ కనిపించింది.
వివరాలు
పోలీసులు వచ్చినప్పుడు విషయం సీరియస్‌గా మారింది
మొదట్లో ఇది ఏదో సాంకేతిక సమస్య అనుకున్నారు. కానీ కొన్ని రోజులకే అనేక తెలియని కాల్స్ రావడం ప్రారంభమైంది. ఇవి సరదాగా చేసే ప్రాంక్ కాల్స్ అనుకున్న మనీష్, ఆపై విరాట్ కోహ్లీ సహా పలువురు క్రికెటర్ల నుంచి కాల్స్ రావడంతో మరింత అయోమయానికి లోనయ్యాడు. జూలై 15న అతనికి మరో కాల్ వచ్చింది.ఆ కాల్‌లో ఉన్న వ్యక్తి తాను రజత్ పాటిదార్ అని పరిచయం చేసుకుని సిమ్‌ను తిరిగి ఇవ్వమని కోరాడు. ఇది కూడా సరదాగా చేసే మోసం అనుకున్న మనీష్,కొద్ది సేపటికే పోలీసులు ఇంటికి రాగానే విషయం గంభీరమైందని గ్రహించాడు. చివరికి ఎంపీ సైబర్ సెల్, గరియాబంద్ పోలీసులు జోక్యం చేసుకుని, రజత్ పాటిదార్‌కు ఆ నంబర్‌ను తిరిగి ఇప్పిచారు.