Page Loader
 Siraj: 'జీర్ణించుకోలేకపోతున్నాను': ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంపిక పై మహమ్మద్ సిరాజ్
'జీర్ణించుకోలేకపోతున్నాను': ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంపిక పై మహమ్మద్ సిరాజ్

 Siraj: 'జీర్ణించుకోలేకపోతున్నాను': ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంపిక పై మహమ్మద్ సిరాజ్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2025
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025లో మహ్మద్ సిరాజ్‌ అద్భుత ప్రదర్శనతో మెరిసిపోతున్నాడు. గత సీజన్ వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఆడిన సిరాజ్‌ బాగా ఆకట్టుకోలేకపోయాడు. ఈసారి మాత్రం గుజరాత్ టైటాన్స్ జట్టులోకి మారిన అతను తన ఆటతీరుతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మ్యాచ్‌లో నాలుగు కీలక వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు. ఆ మ్యాచ్ అనంతరం సిరాజ్‌ తన ప్రదర్శనపై, అలాగే భారత జట్టులో అవకాశాలు రాకపోవడంపై స్పందించాడు.

వివరాలు 

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి ఎంపిక కాకపోవడం.. బాధ కలిగించింది

"సొంత మైదానంలో ఆడటం ఎప్పుడూ ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.కుటుంబసభ్యులు స్టేడియంలో ఉన్నారు కాబట్టి ఈ మ్యాచ్ మరింత స్పెషల్‌గా అనిపించింది.గత ఏడేళ్లుగా బెంగళూరు తరఫున ఆడిన తర్వాత ఇప్పుడు గుజరాత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నా బౌలింగ్ మెరుగుపడేందుకు ఎంతో కష్టపడ్డాను. ఆ శ్రమ ఇప్పుడు ఫలితాన్ని ఇస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి ఎంపిక కాకపోవడం బాధ కలిగించింది. ఒక దశలో ఆ విషయం నన్నెంతో కలిచివేసింది. కానీ, కష్టపడే గుణాన్ని మాత్రం వదలలేదు. గతంలో చేసిన పొరపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకున్నాను. ప్రస్తుతం నా బౌలింగ్‌ని నిజంగా ఆస్వాదిస్తున్నాను. భారత జట్టులో స్థిరంగా ఉన్నప్పుడు నన్ను తప్పించడం పట్ల అందరిలోనూ అనుమానాలు రావడం సహజమే.

వివరాలు 

రెండు వైపులా స్వింగ్‌ చేయగలగడం ఎంతో సంతృప్తికరమైన విషయం

అయినా కూడా, అవకాశాలు రాకపోయినా నా ఉత్సాహాన్ని నిలబెట్టుకుని ముందుకు సాగాను. ఐపీఎల్ కోసం బాగా సిద్ధమయ్యాను. ఒకసారి ప్లాన్‌ చేసినట్లుగా ఫలితాలు వస్తే, వికెట్లు దానంతట అదే వస్తుంటాయి. రెండు వైపులా స్వింగ్‌ చేయగలగడం ఎంతో సంతృప్తికరమైన విషయం," అని సిరాజ్‌ చెప్పాడు.

వివరాలు 

టీ20ల్లో కీలక పాత్ర బౌలర్లదే: గిల్ 

గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ కూడా సిరాజ్‌ బౌలింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. "టీ20 ఫార్మాట్‌లో సాధారణంగా బ్యాటర్ల గురించి ఎక్కువగా మాట్లాడతారు.కానీ నిజానికి గేమ్‌ మలుపు తిప్పేది బౌలర్లే. మేము అన్ని దిశలలో స్ట్రైక్స్ కోసం ప్రయత్నించాం. వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడాడు. ముంబయి మ్యాచ్‌లో అతను సిద్ధంగా ఉన్నప్పటికీ,ఇంపాక్ట్‌ రూల్ వల్ల మరో ఆటగాడిని బరిలోకి దించాల్సి వచ్చింది.ఆ మ్యాచ్‌లో మేమిద్దరం కనీసం 40 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన తర్వాత గేమ్ మనదే అనిపించింది. బౌలింగ్‌లో సిరాజ్‌ ఎనర్జీ సూపర్'' అని గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తెలిపాడు.