టీమిండియా కొత్త జెర్సీపై మండిపడుతున్న ఫ్యాన్స్.. దేశం పేరు లేదని అసంతృప్తి
రేపట్నుంచి డొమినికా వేదికగా వెస్టిండీస్ భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెండు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా ప్లేయర్స్ కొత్త జెర్సీల్లో లుక్ ఇచ్చారు. ఈ ఫోటోలు పలు సమాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.నూతన జెర్సీపై కొందరు అభిమానులు మండిపడుతున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో అప్పటి కిట్ స్పాన్సర్ అడిడాస్ జెర్సీలతోనే భారత్ బరిలోకి దిగింది. అయితే ఆ జెర్సీకి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. జెర్సీ ముందు భాగంలో దేశం పేరు రాసి ఉండటం క్రికెట్ లవర్స్ కు బాగా నచ్చింది. తాజాగా దాని స్థానంలో స్పాన్సర్ డ్రీమ్ 11 పేరు ఉంది. ఈ నెల ప్రారంభంలోనే టీమ్ కొత్త జెర్సీ హక్కులను ఆ సంస్థ పొందింది.
దేశం పేరు ఉండాల్సిన స్థానంలో డ్రీమ్ 11 ఉండటంపై నెటిజన్ల ఆగ్రహం
కొత్త జెర్సీలు ధరించిన ఆటగాళ్ల ఫోటోలను చూసిన క్రికెట్ ప్రేమికులు అసంతృప్తికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐపై దుమ్ము ఎత్తిపోస్తున్నారు. టెస్టు మ్యాచులు అంటే పూర్తిగా వైట్ కలర్‌లోనే ఉంటాయి. అయితే కొత్త జెర్సీలు క్రమంగా రంగులమయంగా మారుతూ వన్డే మాదిరిగా తయారు అవడంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దేశం పేరు ఉండాల్సిన స్థానంలో కంపెనీ పేరు డ్రీమ్ 11 ఉండటాన్ని తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు క్రికెట్ మ్యాచులు దేశం కోసం ఆడుతున్నట్లుగా లేదని, డ్రీమ్ 11 కోసమే ఆడుతున్నట్లు ఉందని నెటీజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కొత్త సైకిల్ (2023-2025) ప్రయాణాన్ని టీమిండియా ఆరంభించనుంది. ఈ మేరకు వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌తో ఇది ప్రారంభం కానుండటం విశేషం.