CWC Qualifiers: శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ.. గాయం కారణంగా తప్పుకున్న దుష్మంత చమీరా
జింబాబ్వే వేదికగా జరుగుతన్న వన్డే వరల్డ్ కప్ మ్యాచుల్లో శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా దుష్మంత చమీరా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతను స్వదేశానికి వెళ్లిపోయాడు. దుష్మంత చమీరా స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక జట్టులోకి తీసుకున్నట్లు శ్రీలంక బోర్డు ప్రకటించింది. చమీరా శ్రీలంక జట్టులో అనుభవజ్ఞుడైన పేసర్, మొదటి నాలుగు లీగ్ మ్యాచులకు దూరంగా ఉన్న అతను, చివరి మ్యాచుల్లో అందుబాటులో ఉంటాడని టీమ్ మేనేజ్ మెంట్ భావించింది. అయితే గాయం తీవ్రత తగ్గకపోవడంతో చమీరా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ప్రపంచ కప్ క్వాలిఫైయర్ సందర్భంగా మొదటి మ్యాచులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చమీరా కుడి భుజానికి గాయమైన విషయం తెలిసిందే.
నేడు నెదర్లాండ్ తో తలపడనున్న శ్రీలంక
ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో చమీరా వన్డేల్లో 50 వికెట్ల మార్క్ ను అందుకున్నాడు. మొత్తం 44 మ్యాచుల్లో 5.4 ఎకానమీతో 50 వికెట్లను పడగొట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో వన్డేల్లో అరంగేట్రం చేసిన మధుశంక, కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. ఈ లీగ్ లో శ్రీలంక వరుసగా నాలుగు విజయాలు సాధించి గ్రూప్-బిలో అగ్రస్థానంలో ఉంది. లహిరు కుమార్, కసున్ రజిత ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అద్భుతంగా రాణిస్తున్నారు. వనిందు హసరంగ, దిముత్ కరుణరత్నే స్పిన్ బౌలింగ్ వికెట్లు తీస్తూ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక సూపర్ సిక్స్ తొలి మ్యాచులో శ్రీలంక, నెదర్లాండ్ తో నేడు తలపడనుంది.