Danish Kaneria: 'నా కెరీర్ నాశనం అయింది'.. మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
పాకిస్థాన్‌లో వివక్షను ఎదుర్కొన్న విషయాన్ని వెల్లడించిన ఆయన, అదే తన క్రికెట్ కెరీర్ నాశనానికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు.
పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిపై తీవ్ర విమర్శలు చేశారు. వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో డానిష్ కనేరియా ఈ విషయాలను వెల్లడించాడు.
వివరాలు
పాక్‌లో వివక్ష
"ఇక్కడ మనమందరం కలుసుకోవడం ఆనందంగా ఉంది. పాకిస్థాన్‌లో నేను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకోవడం ముఖ్యంగా భావిస్తున్నాను. అక్కడ నాకు చాలా వివక్ష ఎదురైంది. ఇప్పుడు నేను నా గళాన్ని వినిపిస్తున్నాను. పాకిస్థాన్‌లో అనేక సందర్భాల్లో మైనారిటీగా వివక్షను అనుభవించాను. అందుకే నా కెరీర్ నాశనమైంది. నాకు తగిన గౌరవం దక్కలేదు. పాక్‌లో మైనారిటీలం కావడమే ఇందుకు కారణం. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నా. మనం పాక్‌లో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి అమెరికాకు తెలిసేలా చేయాలి. అప్పుడే ఏదో ఒక చర్య తీసుకునే అవకాశం ఉంటుంది," అని కనేరియా వ్యాఖ్యానించాడు.
పాకిస్థాన్ తరఫున 61 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కనేరియా,అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
వివరాలు
ఇంజమామ్ మద్దతు
అయితే, షాహిద్ అఫ్రిదీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో తనపై మత మార్పిడి చేయాలని ఒత్తిడి తెచ్చేవాడని పేర్కొన్నాడు.
"పాకిస్థాన్ తరఫున నేను నా శాయశక్తులా ఆటతీరు ప్రదర్శించాను.అయితే,నాకు మద్దతుగా నిలిచిన ఏకైక కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మాత్రమే.షోయబ్ అక్తర్,షాహిద్ అఫ్రిదీ సహా కొంతమంది ఆటగాళ్లు నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవారు. నాకు అసలు సహకారం ఇవ్వలేదు. కనీసం నాతో కలిసి భోజనం చేయడానికి కూడా ఇష్టపడేవారు కాదు. షాహిద్ అఫ్రిదీ అయితే మరీ ఎక్కువగా మతం మారమని ఒత్తిడి చేసేవాడు. ఇది చాలాసార్లు జరిగింది. ప్రతి సందర్భంలోనూ అదే చెప్పేవాడు. కానీ, ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం ఎప్పుడూ అటువంటి విషయాలను ప్రస్తావించేవాడు కాదు," అని కనేరియా స్పష్టం చేశాడు.