David Warner: డేవిడ్ వార్నర్ పై 'జీవితకాల కెప్టెన్సీ' నిషేధం ఎత్తివేసిన క్రికెట్ ఆస్ట్రేలియా
ఇటీవల తన టెస్టు రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటానని ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు ఊరటనిచ్చే వార్త క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు వెల్లడించింది. ఆ దేశ క్రికెట్ బోర్డు అతడిపై ఉన్న 'కెప్టెన్సీ' నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. 2018లో జరిగిన సాండ్‌పేపర్ స్కాంలో భాగంగా, వార్నర్‌పై 'జీవితకాల నాయకత్వం' నిషేధం విధించబడింది. నిషేధాన్ని తొలగించాలని ఇప్పటికే వార్నర్ కోరినట్లు తెలుస్తోంది. ముగ్గురితో కూడిన సమీక్ష ప్యానెల్ ఆ నిషేధంపై ఆమోదించిన నిర్ణయాన్ని ప్రకటించింది.
బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ జట్టుకు నాయకత్వం
ఇప్పటివరకు ఆస్ట్రేలియా టీమ్‌తో లీగ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించకపోయినా, రాబోయే బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ జట్టుకు నాయకత్వం వహించేందుకు అవకాశం పొందినట్లయింది. క్రికెట్ ఆస్ట్రేలియా పర్యవేక్షకులు "డేవిడ్ వార్నర్ తన తప్పులకు బాధ్యత వహించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంపై సమీక్ష చేయాలని ఆయన కోరాడు. సమగ్రంగా సమీక్షించిన అనంతరం, ఆయన జారీ చేసిన స్టేట్‌మెంట్‌ను పరిశీలించాము. నిషేధానికి గురైన తరువాత, ఆయన ప్రవర్తన చాలా మంచిగా మారింది. ప్రత్యర్థి జట్టుపై ఎలాంటి స్లెడ్జింగ్ లేదా కవ్వింపు చర్యలు చేయలేదు. అందువల్ల, రివ్యూ పానెల్ వార్నర్ పై మంచి ఉద్దేశంతోనే ఉంది. కాబట్టి, అతడిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నాం" అని పేర్కొన్నారు.
ఇదీ సాండ్‌పేపర్ స్కాం కథ
2018లో, స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు నాలుగు టెస్టుల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లింది. మొదటి రెండు టెస్టులు సమం అయ్యాయి. మూడవ టెస్టులో, దక్షిణాఫ్రికా రెండవ ఇన్నింగ్స్‌లో, ఆసీస్ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ బంతిని రుద్దుతున్నట్లు కనిపించాడు. ప్రత్యర్థి జట్టు, బాన్‌క్రాఫ్ట్ ఒక సాండ్‌పేపర్ ముక్కను జేబులో దాచినట్లు ఆరోపించింది. ఈ ఘటనలో, వార్నర్ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బాన్‌క్రాఫ్ట్ ఈ విషయంలో సాండ్‌పేపర్‌ను ఉపయోగించినట్లు అంగీకరించాడు. ఈ ఘటన తరువాత, క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. బాన్‌క్రాఫ్ట్‌పై నిషేధం విధించిన దాంట్లో, వార్నర్‌పై కూడా 'జీవితకాల కెప్టెన్సీ' నిషేధం విధించింది.