IPL History: ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప పవర్‌ప్లే స్కోర్..చెత్త రికార్డు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
ఊహించని పరిణామంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఒక చెత్త రికార్డు నమోదు చేసింది. ఆర్సీబీ బౌలింగ్ దెబ్బకు ఢిల్లీ పవర్‌ప్లేలో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కానీ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే డిల్లీ జట్టుకు షాక్‌ల మీద షాక్‌లు తగిలాయి. భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ ఇద్దరూ కలిసి ఢిల్లీ టాప్ ఆర్డర్‌ను పూర్తిగా కుదిపేశారు.
వివరాలు
కష్టాల్లో పడిన ఢిల్లీ క్యాపిటల్స్..
మ్యాచ్ రెండో బంతికే భువనేశ్వర్ కుమార్ సాహిల్ పరాఖ్‌ను అవుట్ చేయగా, తర్వాత హాజిల్‌వుడ్ తన మొదటి రెండు బంతుల్లోనే KL రాహుల్, సమీర్ రిజ్వీని పెవిలియన్‌కు పంపాడు. తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ హ్యాట్రిక్ బంతిని తప్పించుకున్నా, అదే ఓవర్‌లో భువనేశ్వర్ చేతిలో అవుట్ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా అదే ఓవర్‌లో ఔట్ కావడంతో జట్టు పూర్తిగా కష్టాల్లో పడింది.
వివరాలు
దారుణమైన రికార్డు
ఆర్సీబీ బౌలర్ల దాడి కొనసాగుతూనే ఢిల్లీ కేవలం 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. హాజిల్‌వుడ్ తరువాత నితీష్ రాణాను కూడా ఔట్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ మరింత దెబ్బతీశాడు. క్రిక్‌బజ్ సమాచారం ప్రకారం, ఐపీఎల్ చరిత్రలో ఐదో వికెట్ పడే సమయానికి 5/7 అనేది ఇప్పటివరకు అత్యల్ప స్కోర్‌గా నమోదైంది. ఆఖరికి అబిషేక్ పోరెల్, డేవిడ్ మిల్లర్ కొద్దిగా నిలదొక్కుకోవడంతో DC పవర్‌ప్లే 6 ఓవర్లలో 13/6 మాత్రమే చేయగలిగింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప పవర్‌ప్లే స్కోర్‌గా రికార్డైంది. ఇంతకు ముందు ఈ రికార్డు 2009లో కేప్‌టౌన్‌లో ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ చేసిన 14/2 వద్ద ఉండేది.