Page Loader
PBKS vs RCB : ఆర్‌సీబీ చేతిలో ఓటమి.. కానీ పోరాటం ఆగదు: శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు
ఆర్‌సీబీ చేతిలో ఓటమి.. కానీ పోరాటం ఆగదు: శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు

PBKS vs RCB : ఆర్‌సీబీ చేతిలో ఓటమి.. కానీ పోరాటం ఆగదు: శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2025
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఫైనల్‌కి చేరాలన్న పంజాబ్ కింగ్స్ ఆశలకు షాక్ తగిలింది. ముల్లాన్‌పూర్ వేదికగా గురువారం జరిగిన క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చేతిలో పరాజయం పాలైంది. అయితే ఇప్పటికీ పంజాబ్‌కి ఫైనల్‌ అవకాశం మిగిలే ఉంది. జూన్ 1న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న క్వాలిఫయర్-2లో ఎలిమినేటర్ విజేతతో తలపడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్‌కి ఫైనల్‌ టికెట్ అందుతుంది.

Details

తడబడిన పంజాబ్

టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగగా, 14.1 ఓవర్లలో కేవలం 101 పరుగులకే ఆలౌటైంది. మార్కస్ స్టోయినిస్ (26 పరుగులు) ఒక్కడే కొంత మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. మిగతా బ్యాటర్లు తలదించుకునేలా ఆటతీరు కనబరిచారు. ఆర్‌సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్‌లు చెరో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. యష్ దయాల్ రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ తలా ఒక వికెట్ చొప్పున అందించారు.

Details

ఫిల్ సాల్ట్ మెరుపు.. లక్ష్యం సులభం

ఆ తర్వాత 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్‌సీబీ 10 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 27 బంతుల్లో 56 పరుగులు (6 ఫోర్లు, 3 సిక్సర్లు)తో విజయం మార్గం సుగమం చేశాడు. పంజాబ్ బౌలర్లలో ముషీర్ ఖాన్, కైల్ జేమిసన్ చెరో వికెట్ తీశారు. ఆర్‌సీబీ ఎటువంటి ఒత్తిడి లేకుండా గెలిచింది.

Details

'బ్యాటింగ్ వైఫల్యం కారణం' - శ్రేయస్ అయ్యర్

మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, తమ ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమేనని చెప్పాడు. 'పిచ్ పరిస్థితులకు అనుగుణంగా మా బ్యాటర్లు ఆడలేకపోయారు. వరుసగా వికెట్లు కోల్పోయాం. మా ప్రణాళికలను మైదానంలో సమర్థవంతంగా అమలు చేయలేకపోయామని వ్యాఖ్యానించారు. అలాగే బౌలర్లను నిందించాల్సిన అవసరం లేదని, తక్కువ లక్ష్యంతో వారు ఏమి చేయలేకపోయారన్నాడు. "ఇది మర్చిపోలేని రోజు. కానీ మేము మళ్లీ మొదటి నుంచి ప్రణాళికలు రచించుకుంటామని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు.

Details

వ్యూహాలు సరైనవే.. కానీ అమలు లోపించిందన్న శ్రేయస్

ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు. నా నిర్ణయాలపై నాకు సందేహం లేదు. మైదానం వెలుపల తయారు చేసిన వ్యూహాలు సరైనవే, కానీ వాటిని మైదానంలో అమలు చేయడంలో విఫలమయ్యామని స్పష్టం చేశాడు. అలాగే ముల్లాన్‌పూర్ పిచ్‌లో వేరియబుల్ బౌన్స్ కనిపించిందన్నాడు. "ఇది ఓటమికి సాకుగా చెప్పాలనుకోవడం కాదు. కానీ ఇలాంటి పిచ్‌పై బ్యాటింగ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంది. మేము ప్రొఫెషనల్ ఆటగాళ్లమం. పరిస్థితులకు తగినట్లు ఆడాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము ఈ మ్యాచ్ ఓడిపోయాం. కానీ యుద్ధంలో ఓడిపోలేదని శ్రేయస్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్‌కి ఇంకా ఒక అవకాశముంది. ఎలిమినేటర్ విజేతతో జరగనున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఫైనల్‌కి అర్హత పొందనుంది.