Page Loader
MS Dhoni Politics: రాజకీయాల్లోకి ధోనీ?.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ సంచలన ప్రకటన 
రాజకీయాల్లోకి ధోనీ?.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ సంచలన ప్రకటన

MS Dhoni Politics: రాజకీయాల్లోకి ధోనీ?.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ సంచలన ప్రకటన 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2025
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు నాలుగేళ్ల క్రితమే గుడ్‌బై చెప్పినా, అతడి క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. బ్యాట్ పట్టకుండానే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్‌లతో సమానంగా మహీ పేరు మార్మోగిపోతూనే ఉంది. సాధారణంగా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన చాలా మంది ఆటగాళ్లు రాజకీయాల్లోకి ప్రవేశించి రాణించారు. గౌతమ్ గంభీర్, మనోజ్ తివారీ, మహ్మద్ కైఫ్, అజారుద్దీన్, అంబటి రాయుడు వంటి వారు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

Details

క్రికెట్ పై దృష్టి పెట్టిన ధోని

ఇప్పటికే పలువురు ప్రముఖులు ధోనీ రాజకీయాల్లోకి రావాలని సూచించినా, మహీ మాత్రం అందుకు దూరంగా ఉంటూ, తన ఇష్టమైన క్రికెట్ (ఐపీఎల్) కొనసాగిస్తూనే ఉన్నారు. వ్యాపార రంగంలో తన కెరీర్‌ను ముందుకెళ్తున్నాడు. అయితే తాజాగా ధోనీ రాజకీయ ప్రవేశం గురించి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ధోనీ రాజకీయాల్లోకి వస్తే మంచి నాయకుడిగా ఎదగగలడని ఆయన అభిప్రాయపడ్డారు. ధోనీకి రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అతడు పొలిటీషియన్‌గా రాణించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి అని, అయితే అది పూర్తిగా ధోని నిర్ణయమే అని చెప్పారు.

Details

సులభంగా గెలవగలిగే సత్తా ధోనిలో ఉంది

సౌరవ్ గంగూలీ, నేను కలిసి మహీ బెంగాల్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడని అనుకున్నామని, ఎందుకంటే అతడు సులభంగా గెలవగలడని, అతని పాపులారిటీ అంతస్థాయిలో ఉందని శుక్లా వ్యాఖ్యానించారు. ధోనీతో రాజకీయాల గురించి ఓ సందర్భంలో చర్చించిన విషయాన్ని రాజీవ్ శుక్లా గుర్తు చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని మహీని నేరుగా ప్రశ్నించాను. అయితే అతడు 'లేదు' అని స్పష్టంగా చెప్పాడు. నిజానికి ధోనీ ఎక్కువగా బయట కనబడటానికి ఇష్టపడడు. ఫేమ్‌కు దూరంగా, సైలెంట్‌గా ఉండే వ్యక్తిత్వం అతనిదని వెల్లడించారు. అతడి దగ్గర మొబైల్ ఫోన్ కూడా ఉండదని, కనీసం బీసీసీఐ సెలక్టర్లు కూడా అతడిని సంప్రదించాలన్నా కష్టమేనన్నారు.