Mohammed Shami : భార్యతో విడాకులు, ఫిక్సింగ్ ఆరోపణలు అయినా వెనక్కి తగ్గలేదు.. శభాష్ మహ్మద్ షమీ!
కెరీర్‌లో దూసుకుపోతున్న సమయంలో భార్యతో విడాకులు, ఫిక్సింగ్ ఆరోపణలు, రోడ్డు ప్రమాదం.. ఇవేమీ మహ్మద్ షమీని కుంగదీయలేదు. తనపై వస్తున్న ఆరోపణలను మౌనంగా ఎదుర్కొని రాటుదేలారు. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు పడినా, బౌలింగ్‌లో ఏ మాత్రం తడబడలేదు. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక శాతం (33%) వికెట్లను క్లీన్ బౌల్డ్‌లుగా సాధించిన ఆటగాడు షమీ మాత్రమే. ఇక మిచెల్ స్టార్క్ (38%), వకార్ యూనిస్ (36%), వసీం అక్రమ్ (35%) షోయబ్ అక్తర్ (34%) మాత్రమే కెరీర్‌లో అత్యధిక శాతం బౌల్డ్‌లు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒకానొక దశలో తన 11 ఏళ్ల కెరీర్‌లో ఐదేళ్ల పాటు గాయాలు, కుటుంబ వివాదాల కారణంగా కేవలం 14 మ్యాచులను మాత్రమే ఆడాడు.
వన్డే వరల్డ్ కప్ 2023లో విజృంభిస్తున్న షమీ
గృహ హింస కేసు, ఫిక్సింగ్ ఆరోపణలతో బీసీసీఐ అతని కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ పరిణామాలపై ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను కంటితడి కూడా పెట్టాడు. మరోవైపు దిల్లీ డేర్ డెవిల్స్ కూడా 2019 సీజన్ ముందు ఐపీఎల్‌లో అతడిని వదులుకుంది. 2019లో 21 వన్డేలు ఆడి 42 వికెట్లను తీశాడు. చాలా కాలం తర్వాత గుజరాత్ టైటాన్స్ తరుఫున బరిలోకి దిగిన షమీ అద్భుత ప్రదర్శనతో విమర్శకుల నోరు మూయించాడు. ఇక ఈ ఏడాది 14 వన్డేల్లో 28 వికెట్లు తీసి సత్తా చాటాడు. హార్ధిక్ గాయం తర్వాత ప్రపంచ కప్ జట్టులో అడుగుపెట్టిన షమీ ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు.