
Novak Djokovic : వింబుల్డన్‌లో శతవిజయాలు పూర్తి చేసిన జకోవిచ్… చరిత్రలో మూడో ఆటగాడిగా అరుదైన ఘనత
ఈ వార్తాకథనం ఏంటి
లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ టోర్నమెంట్‌లో మరో చరిత్రాత్మక మైలురాయి నమోదైంది. టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ 100 వింబుల్డన్ విజయాలు సాధించిన మూడవ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 38 ఏళ్ల జకోవిచ్ ప్రస్తుతం తన 20వ వింబుల్డన్ టోర్నీలో పాల్గొంటున్నాడు. సెర్బియాకు చెందిన అతడు, అదే దేశానికి చెందిన కెమనోవిచ్‌ను వరుస సెట్లలో మట్టికరిపించి ఈ అరుదైన ఘనతను సాధించాడు. స్కోరు 6-3,6-0,6-4తో జకోవిచ్ స్పష్టమైన ఆధిక్యంలో గెలుపొందాడు. ఇంతకు ముందు వింబుల్డన్‌లో 100 లేదా అంతకంటే ఎక్కువ విజయం సాధించిన ఆటగాళ్లలో మార్టినా నవ్రతిలోవా, రోజర్ ఫెదరర్ మాత్రమే ఉన్నారు. మహిళల విభాగంలో నవ్రతిలోవా 120 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించగా, పురుషుల విభాగంలో ఫెదరర్ 105 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు.
Details
8సార్లు టైటిల్ గెలిచిన రికార్డు
ఫెదరర్ వింబుల్డన్ టోర్నీలో 8 సార్లు టైటిల్ గెలిచిన ఘనతను కూడా కలిగి ఉన్నాడు. ఇక నొవాక్ జకోవిచ్ విషయానికి వస్తే, అతడు తన కెరీర్‌లో ఏకంగా 428 వారాల పాటు ATP ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని కొనసాగించాడు. ఇప్పుడు ఈ టోర్నీలో జకోవిచ్ తన ఎనిమిదవ వింబుల్డన్ టైటిల్‌ను సాధించి ఫెదరర్ రికార్డును సమం చేయాలనే లక్ష్యంతో ఉన్నాడు. జకోవిచ్ ఈ టైటిల్‌ను గెలిస్తే, ఓపెన్ ఎరాలో పురుషుల 'మేజర్' సింగిల్స్ టైటిల్‌ను గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా నిలుస్తాడు. ఇక ఇదే నెలలో ముగిసిన రోలాండ్ గారోస్ టోర్నమెంట్‌లోనూ జకోవిచ్ తన క్లే కోర్ట్ కెరీర్‌లో 100వ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.