IND vs ENG: హాఫ్ సెంచరీలతో రాణించిన డకెట్, రూట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ ఇవాళ రెండో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచులో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో డకెట్ (65), జో రూట్ (69) అర్ధశతకాలు నమోదు చేశారు.
అలాగే, బ్రూక్ (31), బట్లర్ (34), లివింగ్‌స్టన్ (41) కీలక ఇన్నింగ్స్ ఆడారు. టీమిండియా బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా మెరుగైన ప్రదర్శనతో 3 వికెట్లు తీశాడు.
షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి తలా ఓ వికెట్ సాధించారు.
Details
ఓపెనర్లు శుభారంభం
ఇంగ్లండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ జట్టుకు శుభారంభం అందించారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
వీరిద్దరూ నిలకడగా ఆడటంతో ఇంగ్లండ్ తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది.
అయితే ఈ మ్యాచ్‌తో వన్డేల్లోకి అరంగేట్రం చేసిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫిల్ సాల్ట్‌ను ఔట్ చేసి భారత్‌కు తొలి బ్రేక్‌ను ఇచ్చాడు. 10.5 ఓవర్‌లో వరుణ్ వేసిన బంతిని సాల్ట్ జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
దూకుడుగా ఆడుతున్న బెన్ డకెట్‌ను రవీంద్ర జడేజా తన తొలి ఓవర్‌లోనే పెవిలియన్‌కు పంపాడు.
15.5 ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డకెట్, లాంగాన్‌లో హార్దిక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
Details
కట్టుదిట్టంగా బౌలింగ్ భారత బౌలర్లు
అనంతరం రూట్, బ్రూక్ జోడీ బాధ్యత తీసుకుంది. ఈ ద్వయం భారత స్పిన్నర్ల బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ నిలకడగా ఆడింది.
అయితే ప్రమాదకరంగా మారిన ఈ భాగస్వామ్యాన్ని హర్షిత్ రాణా విడదీసాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన బ్రూక్ బంతిని గాల్లోకి లేపగా, శుభ్‌మన్ గిల్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ పట్టి అతడిని పెవిలియన్‌కు పంపాడు.
జో రూట్, బట్లర్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
ఈ దశలో ఇంగ్లండ్ 320కి పైగా స్కోరు చేసే అవకాశమున్నట్లు కనిపించింది.
అయితే, భారత బౌలర్లు పుంజుకుని కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తూ వరుస విరామాల్లో వికెట్లు తీశారు.
Details
జో రూట్ వికెట్ పడగొట్టిన జడేజా
38.4 ఓవర్‌లో హార్దిక్ బౌలింగ్‌లో బట్లర్ మిడాఫ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
కొద్ది సేపటికే జడేజా బౌలింగ్‌లో జో రూట్ కోహ్లీ చేతికి చిక్కాడు.
ఒవర్టన్ (6) వికెట్ కూడా జడ్డూ ఖాతాలో చేరింది. ఇన్నింగ్స్ ముగియడానికి ఇంకా సమయం పట్టదని భావించినా లియామ్ లివింగ్‌స్టోన్ (41), అదిల్ రషీద్ (14) చివర్లో దూకుడు ప్రదర్శించారు.
ముఖ్యంగా షమీ బౌలింగ్‌ను టార్గెట్ చేస్తూ రషీద్ హ్యాట్రిక్ బౌండరీలు బాదాడు. చివరి నాలుగు ఓవర్లలో ఇంగ్లండ్ బ్యాటర్లు 43 పరుగులు రాబట్టారు. అయితే చివరి మూడు వికెట్లు రనౌట్ రూపంలో పడటం గమనార్హం.