Page Loader
ENG vs IND: డ్యూక్‌ బంతులను విశ్లేషిస్తాం : తయారీ సంస్థ
డ్యూక్‌ బంతులను విశ్లేషిస్తాం : తయారీ సంస్థ

ENG vs IND: డ్యూక్‌ బంతులను విశ్లేషిస్తాం : తయారీ సంస్థ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెండూల్కర్-అండర్సన్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్, భారత జట్ల మధ్య ఇప్పటివరకు మూడు టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌ల్లో ఉపయోగించిన డ్యూక్‌ బంతుల నాణ్యతపై ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు మాజీ క్రికెటర్లు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్‌ల్లో వాడిన బంతులను తాము సమగ్రంగా పరిశీలిస్తామని డ్యూక్‌ బంతుల తయారీ సంస్థ స్పష్టం చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టు సందర్భంగా,భారత కెప్టెన్‌ శుభమన్‌ గిల్ డ్యూక్‌ బంతుల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ బంతులు వేగంగా గట్టి దనాన్ని కోల్పోతున్నాయని, తక్కువ ఓవర్లలోనే బంతి ఆకారం మారిపోతోందని ఆరోపించాడు. ఇలా మారడం వల్ల బ్యాటర్లకు అనుకూలంగా మారుతోందని విమర్శించాడు.

వివరాలు 

ఇంగ్లాండ్‌లోనే డ్యూక్‌ బంతులు ఆకారం మారిపోవడం ఆశ్చర్యం

''బంతి ఆకారం త్వరగా మారిపోతే బౌలర్లకు సమస్యలు ఏర్పడతాయి.బంతి పిచ్ కంటే ముందే షేప్‌ అవుట్‌ అయితే వికెట్లు తీయడం బౌలర్లకు చాలా కష్టమవుతుంది.పైగా బంతి మెత్తబడిపోతే పేస్‌ బౌలర్లకు సహకారం అందదు.ఎందుకు ఇలా జరుగుతోంది అనేది మాకు అర్థం కావడం లేదు,''అని గిల్‌ వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నాడు.''మేము విదేశాల్లో ఆడినప్పుడు అక్కడి బంతుల విషయంలో ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి.కానీ ఇప్పుడు ఇంగ్లాండ్‌లోనే డ్యూక్‌ బంతులు ఆకారం మారిపోవడం చూసి ఆశ్చర్యం కలుగుతోంది.దీనికి ఏదైనా పరిష్కారం వెతకాల్సిందే'' అని స్టోక్స్‌ చెప్పాడు. డ్యూక్‌ బంతుల నాణ్యత తగ్గుతోందని ఇంగ్లాండ్‌ మాజీ ఫాస్ట్ బౌలర్‌ స్టువార్ట్‌ బ్రాడ్ కూడా అభిప్రాయపడ్డాడు.వెంటనే సవరణ చర్యలు తీసుకోవాలని కోరాడు.

వివరాలు 

మేము ఆ మూడు టెస్టుల్లో ఉపయోగించిన బంతులన్నింటిని పరిశీలిస్తాం: జగ్‌జోడియా

ప్రారంభంలో డ్యూక్‌ బంతుల తయారీ సంస్థ మాత్రం ఆటగాళ్ల అభ్యంతరాలను వ్యతిరేకించింది. ''బంతి ఏదో రాయి కాదు కాబట్టి కొన్నిసార్లు చెడిపోవడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్‌ అధికారులు నిబంధనల్లో మార్పులు చేయాలి. ఉదాహరణకు, రెండో కొత్త బంతిని 60 నుంచి 70 ఓవర్ల మధ్య తీసుకునేలా నియమాలను రూపొందించవచ్చు,'' అని బ్రిటిష్‌ క్రికెట్ బాల్స్‌ లిమిటెడ్‌ యజమాని దిలీప్‌ జగ్‌జోడియా అప్పట్లో అభిప్రాయపడ్డాడు. అయితే ఇప్పుడు ఆయన స్వరంలో మార్పు కనిపిస్తోంది. ''మేము ఆ మూడు టెస్టుల్లో ఉపయోగించిన బంతులన్నింటిని పరిశీలిస్తాం. మా తయారీ నిపుణులతో సమీక్ష నిర్వహిస్తాం. బంతుల తయారీలో ఉపయోగించే ముడిసరుకులపై కూడా సమీక్షిస్తాం. అవసరమైతే తగిన మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం'' అని జగ్‌జోడియా తెలిపారు.

వివరాలు 

టెస్టు క్రికెట్‌లో ఆతిథ్య దేశానికి బంతిని ఎంచుకునే అవకాశం 

టెస్టు క్రికెట్‌లో ఆతిథ్య దేశమే ఉపయోగించే బంతిని ఎంచుకునే హక్కును కలిగి ఉంటుంది. భారత్‌లో ఎస్‌జీ బంతులు, ఆస్ట్రేలియాలో కూకబుర్ర బంతులు, ఇంగ్లాండ్‌లో డ్యూక్‌ బంతులు వాడుతారు. డ్యూక్‌ బంతులు సీమ్ అనుకూల పరిస్థితుల్లో మెరుగైన స్వింగ్‌ కలిగిస్తాయని పేరుంది. కానీ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న సిరీస్‌లో ఈ బంతుల నాణ్యతపై తీవ్రమైన అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి.