Erriyon Knighton: రన్నింగ్‌లో ఉసేన్ బోల్ట్‌ను మించిన ఎరియన్ నైటాన్!
రన్నింగ్ అంటేనే గుర్తుకొచ్చే పేరు ఉసేన్ బోల్ట్. చిరుత వేగంతో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు బోల్ట్ బాటలోనే మరో స్పింటర్ ఎరియన్ నైటాన్ ట్రాక్‌లో సంచలన రికార్డులను నమోదు చేస్తున్నాడు. ఏకంగా బోల్ట్ రికార్డునే ఎరియన్ నైటాన్ బద్దలు కొట్టి ఔరా అనిపించాడు. ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో ఈ అమెరికా స్ప్రింటర్ పైనే అందరి దృష్టి నెలకొంది. ఫ్లోరిడా కు చెందిన ఎరియన్ నైటాన్ బోల్ట్ మాదిరిగానే పొడుగ్గా, సన్నగా ఉంటాడు. నిజానికి నైటాన్ చిన్నప్పటి నుంచి రన్నర్ కాదు. చాలాకాలం ఫుట్ బాల్ ఆటలో రాణించిన నైటాన్, తనలో ఉన్న మెరుపు వేగాన్ని ఆలస్యంగా గుర్తించాడు.
బోల్ట్ రికార్డును బద్దలు ఎరియన్ నైటాన్
ఫ్లోరిడా యూనివర్సిటీ కోచ్ మైక్ హోలోవె శిక్షణలో రాటుదేలిన ఎరియన్ నైటాన్ 200 మీటర్ల పరుగులో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. 2020లో జూనియర్ ఒలింపిక్ క్రీడల్లో 200 మీటర్ల పరుగును 20.33 సెకన్లలో పూర్తి చేసి 15-16 వయస్సు విభాగంలో కొత్త రికార్డును సృష్టించాడు. 200 మీటర్ల పరుగును 19.49 సెకన్లలో పూర్తి చేసి ఉసేన్ బోల్ట్ పేరిట 18 ఏళ్లుగా ఉన్న రికార్డును నైటాన్ బద్దలు కొట్టాడు. 200 మీటర్ల పరుగును 20 సెకన్లలోపు పరుగెత్తిన తొలి అమెరికా అథ్లెట్‌గా రికార్డుకెక్కాడు. రెండుసార్లు ప్రపంచ అథ్లెటిక్స్ 'రైజింగ్ స్టార్'అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం 200 మీటర్ల పరుగులో స్వర్ణం నెగ్గి 2024 పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటాలని నైటాన్ భావిస్తున్నాడు.