Rohit Sharma: పుష్కరం అయినా.. చెక్కుచెదరని రో'హిట్' రికార్డు.. ఇప్పటికీ అందనంత దూరంలో!
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పన్నెండేళ్ల కిందట నెలకొల్పిన అరుదైన రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు ఇప్పటివరకు ఏ ఆటగాడూ చేరువ కాలేకపోతున్నాడు. ఇంతకీ హిట్‌మ్యాన్ సృష్టించిన ఆ చరిత్ర ఏమిటి? ఎవరిపై ఈ ఘనత సాధించాడో తెలుసుకుందాం. వన్డే క్రికెట్‌లో సెంచరీలు చేయడం సాధారణమే. కొంత కష్టమైనా డబుల్ సెంచరీలు కూడా నమోదవుతున్నాయి. సచిన్ తెందుల్కర్ తొలిసారిగా వన్డేల్లో ద్విశతకం బాది ఈ ఘనతకు మార్గం చూపించాడు. ఆ తర్వాత హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మాత్రం ఎవరూ అందుకోలేని రెండు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించడంతో పాటు.. మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
వివరాలు
173 బంతుల్లోనే 264 పరుగులు
2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కేవలం 173 బంతుల్లోనే 264 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.
దీంతో టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 404 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారత బౌలర్ల ధాటికి శ్రీలంక 251 పరుగులకే కుప్పకూలింది.
రోహిత్ ఒక్కడే చేసిన పరుగుల కంటే కూడా లంక జట్టు తక్కువ స్కోరు చేయడం విశేషం.
ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు మూడు వన్డే డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మనే. తొలుత 2013లో ఆస్ట్రేలియాపై 158 బంతుల్లో 209 పరుగులు చేసి తన తొలి ద్విశతకాన్ని నమోదు చేశాడు.
వివరాలు
మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్!
ఆ తర్వాత 2014లో శ్రీలంకపై 264 పరుగులతో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును సృష్టించాడు. ఇక 2017లో మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు. 153 బంతుల్లో 208 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఇలా వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించి ఎవరూ అందుకోలేని ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండు వన్డే ద్విశతకాలతో రోహిత్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
అయినప్పటికీ హిట్‌మ్యాన్ నెలకొల్పిన మూడు డబుల్ సెంచరీల రికార్డును ఇప్పటివరకు ఎవరూ సమం చేయలేకపోయారు. పన్నెండేళ్లు గడిచినా రోహిత్ 264 పరుగుల ప్రపంచ రికార్డు కూడా అలాగే కొనసాగుతోంది.