Loading...
Suryakumar Yadav: కెప్టెన్సీ పోయినా తగ్గేదేలే.. సెలెక్టర్లకు సూర్య అదిరిపోయే సంకేతాలు!
కెప్టెన్సీ పోయినా తగ్గేదేలే.. సెలెక్టర్లకు సూర్య అదిరిపోయే సంకేతాలు!

Suryakumar Yadav: కెప్టెన్సీ పోయినా తగ్గేదేలే.. సెలెక్టర్లకు సూర్య అదిరిపోయే సంకేతాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2026
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026లో ముంబై కెప్టెన్‌గా బరిలోకి దిగిన సూర్య.. హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి తనలోని దూకుడు ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్ గ్రౌండ్‌లో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో సూర్య మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

వివరాలు

ముషీర్ ఖాన్‌దీ మెరుపు ఇన్నింగ్స్‌..

హైదరాబాద్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబైకి ఓపెనర్లు అంగ్‌క్రిష్ రఘువంశీ, హార్దిక్ తమోర్ శుభారంభం అందించారు.

తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించిన తర్వాత రఘువంశీ 13 బంతుల్లో 27 పరుగులు చేసి ఔటయ్యాడు.

అనంతరం హార్దిక్ తమోర్, ముషీర్ ఖాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. హార్దిక్ 16 బంతుల్లో 22 పరుగులు చేయగా.. ముషీర్ కేవలం 24 బంతుల్లోనే 51 పరుగులతో మెరిశాడు.

వివరాలు

15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..

ముషీర్ ఔటైన తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌండరీలతో హోరెత్తించాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.

చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన సూర్య.. 21 బంతుల్లో 60 పరుగులు చేశాడు.

ఇందులో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. 285.71 స్ట్రైక్‌రేట్‌తో అతడు ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌ ముంబైకి సునాయాస విజయాన్ని అందించింది.

శివమ్ దూబే ఐదు బంతుల్లో రెండు సిక్సర్లతో 13 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ADVERTISEMENT

వివరాలు

172 పరుగులకే హైదరాబాద్ ఆలౌట్

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. అభిరథ్ రెడ్డి 24 బంతుల్లో 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

కోడిమెల హిమతేజ 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు. కెప్టెన్ చామ మిలింద్ 12 బంతుల్లో 22 పరుగులు చేయగా.. ప్రణవ్ వర్మ 14 బంతుల్లో 18 పరుగులు సాధించాడు.

ముంబై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో హైదరాబాద్ భారీ స్కోరు సాధించలేకపోయింది.

మాక్స్‌వెల్ స్వామినాథన్ నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

ADVERTISEMENT

వివరాలు

టీమిండియాలోకి తిరిగి రావడమే లక్ష్యంగా..

సూర్యకుమార్ యాదవ్‌కు 2026 జూన్‌లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీ20 ప్రపంచకప్‌ 2026 టైటిల్ అందించిన కొద్ది నెలలకే అతడిని భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు జట్టులోనూ చోటు కోల్పోయాడు.

అనంతరం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దీంతో మళ్లీ టీమిండియాలోకి రావడమే లక్ష్యంగా సూర్య దేశవాళీ క్రికెట్‌పై దృష్టి పెట్టాడు.

రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత 2024 జూలైలో సూర్య భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. అతడి నాయకత్వంలో భారత్ 50 మ్యాచ్‌ల్లో 42 విజయాలు సాధించింది.

వివరాలు

టీమిండియాకు తిరిగొచ్చే అవకాశాలు

ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లు, టోర్నీల్లో ఓటమి లేకుండా జట్టును నడిపించడంతో పాటు ఆసియా కప్‌ 2025, టీ20 ప్రపంచకప్‌ 2026 టైటిళ్లను అందించాడు.

తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌పై ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సూర్య తన ఫామ్‌ను చాటుకున్నాడు.

15 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించడం ద్వారా బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశాడు. ఇదే జోరును కొనసాగిస్తే టీమిండియాలోకి తిరిగి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

ADVERTISEMENT