LOADING...
Suryakumar: గిల్‌ వల్ల ఒత్తిడి పెరిగినా అది నాకు ప్రేరణే : సూర్యకుమార్
గిల్‌ వల్ల ఒత్తిడి పెరిగినా అది నాకు ప్రేరణే : సూర్యకుమార్

Suryakumar: గిల్‌ వల్ల ఒత్తిడి పెరిగినా అది నాకు ప్రేరణే : సూర్యకుమార్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2025
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం టీమిండియాకు రెండు భిన్న ఫార్మాట్లకు ఇద్దరు ప్రత్యేక కెప్టెన్లు నాయకత్వం వహిస్తున్నారు. టెస్టులు, వన్డే మ్యాచ్‌లకు శుభ్‌మన్‌ గిల్‌ బాధ్యతలు చేపడుతుండగా, టీ20 ఫార్మాట్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వం వహిస్తున్నాడు. చిన్న ఫార్మాట్‌లో గిల్‌ కూడా సూర్యకు వైస్‌ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగబోయే టీ20 సిరీస్‌కుగాను ఎంపిక చేసిన జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారిథిగా ఎంపికయ్యాడు. అయితే, భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌గా గిల్‌ను నియమించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తనపై ఒత్తిడి పెరిగిందనేది నిజమేనని సూర్య స్వయంగా ఒప్పుకున్నాడు. ఆ ఒత్తిడినే ప్రేరణగా తీసుకొని మెరుగైన ఆటతీరుకు కట్టుబడతానని చెప్పాడు.

 Details

గిల్ నాయకత్వం వహించడం సంతోషంగా ఉంది

రెండు ఫార్మాట్లకు గిల్‌ నాయకత్వం వహించడం ఆనందంగా ఉంది. జట్టును అతడు చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాడు. అతడి రాకతో నాపై ఒత్తిడి పెరిగిందని చాలా మంది చెబుతున్నారు. దాంట్లో అసత్యం చెప్పను. అలాంటి ఆలోచన, భయం లేదా ఆందోళన ప్రతి ఒక్కరికి సహజమే. కానీ నేను దానిపై ఎక్కువగా దృష్టి పెట్టను. నా ఆటతీరంపైనే దృష్టిసారిస్తా. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. భవిష్యత్తులో టీ20 జట్టు పగ్గాలు గిల్‌కు అప్పగించినా నాకు అభ్యంతరాలు లేవు. మైదానంలోనే కాదు బయట కూడా మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. గిల్‌ విషయానికొచ్చేసరికి నాకు సంతోషమేనని సూర్యకుమార్‌ యాదవ్ వ్యాఖ్యానించాడు.

Details

పడిపోయిన ఫామ్‌.. పెరిగిన అంచనాలు 

ఒకప్పుడు సూర్య క్రీజ్‌లో అడుగు పెడితే ప్రత్యర్థి బౌలర్లకు ముప్పే తప్ప మిగతా ఆలోచనలు ఉండేవి కాదు. కానీ ఇటీవల అతని నుంచి అద్భుత ఇన్నింగ్స్‌లు చాలా అరుదుగా మాత్రమే చూశారు అభిమానులు. మరోవైపు గిల్‌ టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బ్యాటింగ్‌లోనూ శక్తివంతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌ జరగనుండటంతో అప్పటివరకు సూర్య నాయకత్వాన్ని కొనసాగించాలంటే ఆస్ట్రేలియాతో జరగబోయే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అతను మెరిసి చూపించాల్సిందేనని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.