Rohit Sharma : మూడో వన్డేలో ఓడినా.. తమ ఆటతీరు పట్ల సంతృప్తిగానే ఉన్నాం : రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్ 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. అయినా మొదటి రెండు వన్డేలను గెలిచిన భారత్ మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ట్రోఫీ అందుకున్న తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలను చేశాడు. వ్యక్తిగతంగా తన ప్రదర్శన పట్ల ఆనందంగా ఉందని, అన్ని విధాలుగా జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ లు ఆడాలన్నదే తన లక్ష్యమని రోహిత్ పేర్కొన్నారు.
తమ ఆటతీరు పట్ల సంతోషంగా ఉంది : రోహిత్
గత ఏడెనిమిది వన్డేల్లో తమ ఆటతీరు పట్ల ఆనందంగా ఉందని, విభిన్న పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదర్కొనేందుకు సిద్ధమయ్యాని, వేర్వేరు జట్లతో బరిలోకి దిగామని, దురదృష్టవశాత్తు మూడో వన్డేలో ఓడిపోయామని రోహిత్ శర్మ వెల్లడించారు. అయినా చివరి వన్డేలో ఎన్నో సానుకూల అంశాలున్నాయని, బ్యాటింగ్ అనుకూలంగా ఉన్న పిచ్‌పై మెరుగైన బౌలింగ్ ప్రదర్శన చేశామన్నారు. పేసర్ బుమ్రా బౌలింగ్ ఆకట్టుకుందని, ఆరంభంలో కాస్త ఎక్కువ పరుగులిచ్చినా తర్వాతి నియంత్రించాడని, ఒక మ్యాచులో ఎక్కువ పరుగులిచ్చినా మాత్రాన సమస్యేమీ లేదన్నారు.