Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్ నుండి క్రీడల తొలగింపు.. భారత క్రీడాకారుల నిరసన
కామన్వెల్త్ గేమ్స్ నుండి క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, షూటింగ్ వంటి ప్రధాన క్రీడలను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో భారత క్రీడాభిమానులకు తీవ్ర ఆవేదనకు కారణమైంది. ఈ నిర్ణయం వల్ల భారత్‌కు పతకాలు అందించే ముఖ్యమైన క్రీడలు తొలగిపోతున్నాయని, దీని పట్ల పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. క్రీడా నిపుణులు, అథ్లెట్లు ఈ చర్యను తప్పుపడుతూ, క్రీడలను తిరిగి చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. వినతులు ఆలకించకపోతే, గేమ్స్‌ను బహిష్కరించాలన్న డిమాండ్లు కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు విన్పిస్తున్నాయి. స్టార్ షట్లర్ చిరాగ్ శెట్టి ఈ నిర్ణయంపై తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కామన్వెల్త్ గేమ్స్ నుండి బ్యాడ్మింటన్ వంటి ముఖ్యమైన క్రీడను తొలగించడం చాలా దారుణమన్నారు.
ప్రభుత్వం స్పందించాలి
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించే క్రీడల్లో బ్యాడ్మింటన్ కూడా ఒకటి అని, తాను రెండు సార్లు ఆడానని, ప్రతి మ్యాచ్‌కు భారీగా ప్రేక్షకులు వచ్చారన్నారు. ఈ నిర్ణయంపై నిర్వాహకులు పునరాలోచించాలని చెప్పారు. కానీ అది మా చేతుల్లో లేదు. ప్రభుత్వం, క్రీడా సంఘాలు మాత్రమే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని వెల్లడించారు. హాకీ స్టార్ ప్లేయర్ జర్మన్‌ప్రీత్ సింగ్ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కామన్వెల్త్ గేమ్స్ నుండి హాకీని తొలగించడం చాలా బాధకరమైన విషయమని, తమ ఆటగాళ్లంతా ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, కానీ ఈ నిర్ణయంతో హాకీ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ క్రీడను మళ్లీ గేమ్స్‌లో చేర్చాలని జర్మన్‌ప్రీత్ సింగ్ కోరారు.