Rinku Singh: తండ్రికి అనారోగ్యం.. జట్టును వీడిన రింకు!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ రింకు సింగ్ గురువారం జింబాబ్వేతో జరగనున్న టీ20 ప్రపంచకప్ సూపర్-8 మ్యాచ్‌లో ఆడే విషయంలో సందేహాలు నెలకొన్నాయి. కుటుంబంలో ఏర్పడిన అత్యవసర పరిస్థితుల కారణంగా అతను జట్టు నుంచి దూరమైనట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో నిర్వహించిన నెట్ ప్రాక్టీస్‌కు కూడా రింకు హాజరు కాలేదు. ఇదిలా ఉండగా, అతని తండ్రి కంచన్‌చంద్ సింగ్ అనారోగ్యంతో గ్రేటర్ నోయిడాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం వెలువడింది.
వివరాలు
ప్రపంచకప్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన రింకు
రింకు అందుబాటులో లేకపోతే తుది జట్టులో మార్పులు చేసే అవకాశముంది. మరో బ్యాటర్‌ను ఎంపిక చేయాలనుకుంటే సంజు శాంసన్‌కు అవకాశం దక్కుతుంది. అదే బౌలర్‌ను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయిస్తే కుల్‌దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు సూపర్-8 దశతో పాటు ఈ ప్రపంచకప్‌లో రింకు మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడాడు. దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ఖాతా కూడా తెరవలేకపోయిన అతను, నెదర్లాండ్స్‌పై 6 పరుగులు, పాకిస్థాన్‌పై 11 పరుగులు, నమీబియాపై 1 పరుగు, అమెరికాపై 6 పరుగులు మాత్రమే నమోదు చేశాడు.