Finn Allen: 'ఫిన్ అలెన్ 2.0'గా మారుతున్నా.. 40 బంతులు ఆడటమే నా లక్ష్యం: కేకేఆర్ స్టార్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌ను నిరాశాజనకంగా ప్రారంభించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పుడు వరుస విజయాలతో జోరు మీద ఉంది. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా కేవలం 14.2 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా గెలుపు సాధించింది. ఈ విజయంలో న్యూజీలాండ్ స్టార్ బ్యాటర్ ఫిన్ అలెన్ కీలక పాత్ర పోషించాడు. తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 10 భారీ సిక్సర్లు బాదిన అలెన్‌కి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' లభించింది.
వివరాలు
ఆట తీరులో కొత్త మార్పు..
మ్యాచ్ అనంతరం ఫిన్ అలెన్ మాట్లాడుతూ.. తన ఆటతీరులో కొత్త మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నానని తెలిపాడు. ప్రస్తుతం తాను 'ఫిన్ అలెన్ 2.0'గా మారే దిశగా ముందుకు సాగుతున్నానని చెప్పాడు. కేవలం దూకుడే కాదు, పరిస్థితులకు అనుగుణంగా ఆడటం కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నానని వివరించాడు. "ఇప్పటి నా బ్యాటింగ్‌ను చూస్తే అది ఫిన్ అలెన్ 2.0లా అనిపిస్తుంది. నా ఆటలో కొత్త కోణాలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను. మొదట్లో బ్యాటింగ్ చేయడం అంత ఈజీగా అనిపించలేదు. ముఖ్యంగా అక్షర్ పటేల్ చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అందుకే ఎక్కువసేపు క్రీజులో నిలబడాలని భావించాను. ఈ అంశంపై షేన్ వాట్సన్, అభిషేక్ నాయర్‌లతో కలిసి పని చేస్తున్నాను" అని అలెన్ వెల్లడించాడు.
వివరాలు
40 బంతులు ఆడాలనే లక్ష్యం..
అలాగే తన బ్యాటింగ్ తత్వంపై మాట్లాడుతూ.. "నాకు నేనే మరిన్ని అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నాను. కొన్ని మ్యాచ్‌ల్లో మంచి ఆరంభం లభించినా వాటిని పెద్ద స్కోర్లుగా మార్చుకోలేకపోవడం నిరాశ కలిగించింది. అయితే ఈ మ్యాచ్‌లో వ్యక్తిగతంగా మంచి ప్రదర్శన చేయడం ఆనందంగా ఉంది. కొన్ని సందర్భాల్లో సహజమైన దూకుడు ఆటను పక్కనబెట్టి మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడాల్సి వస్తుంది. నేను ఎక్కువసేపు క్రీజులో ఉంటే మ్యాచ్‌ను మలుపుతిప్పగలననే నమ్మకం ఉంది. ప్రతి మ్యాచ్‌లో కనీసం 40 బంతులు ఆడాలని లక్ష్యంగా పెట్టుకుంటాను. అది ప్రతిసారి సాధ్యం కాకపోయినా.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆ ఆలోచన నాకు బాగా ఉపయోగపడింది" అని తెలిపాడు.
వివరాలు
అధిక ఒత్తిడితో ఆట..
జట్టులో స్థానం కోల్పోయి మళ్లీ తిరిగి వచ్చిన అనుభవంపై కూడా ఫిన్ అలెన్ స్పందించాడు. "కొంతకాలం జట్టుకు దూరంగా ఉండటం వల్ల మన ఆలోచనా విధానం మారుతుంది. మానసికంగా ఫ్రెష్‌గా మారేందుకు అవకాశం లభిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ సీజన్ ఆరంభంలో నాపై నేనే అధిక ఒత్తిడి పెట్టుకున్నాను. అందుకే కొద్దిసేపు విరామం తీసుకుని ప్రశాంతంగా ఆలోచించి తిరిగి రావడం నాకు చాలా ఉపయోగపడింది" అని ఫిన్ అలెన్ చెప్పుకొచ్చాడు.