India Playing XI: జపాన్‌తో తొలి టీ20.. బరిలోకి దిగే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
2026 ఏషియన్ గేమ్స్ కోసం భారత క్రికెట్ జట్టు జపాన్‌కు చేరుకుంది. పురుషుల క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానుండగా.. టీమిండియా సెప్టెంబర్ 28న తన మ్యాచ్ ఆడనుంది. అయితే ఏషియన్ గేమ్స్‌కు ముందు భారత జట్టు జపాన్‌తో ఒక ఏకైక టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత్, జపాన్ క్రికెట్ జట్లు తొలిసారి తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. 'సుజుకి కప్' పేరుతో ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. జపాన్‌లోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
వివరాలు
బుమ్రా, అభిషేక్, ఇషాన్‌కు విశ్రాంతి?
ఏషియన్ గేమ్స్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లకు ఈ మ్యాచ్ కీలకమైన సన్నాహకంగా ఉపయోగపడనుంది. ముఖ్యంగా జపాన్‌తో జరిగే ఏకైక టీ20లో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. జపాన్‌తో మ్యాచ్‌కు స్టార్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లకు టీమిండియా మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే యువ ఆటగాళ్లకు తమ సత్తా నిరూపించుకునే అవకాశం లభించనుంది. అభిషేక్ శర్మ స్థానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
బౌలింగ్ విభాగంలో వీరికి ఛాన్స్..
వన్‌డౌన్‌లో శ్రేయస్ అయ్యర్, నాలుగో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
వారి తర్వాత శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, విప్రజ్ నిగమ్‌లకు తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది. గాయపడిన వరుణ్ చక్రవర్తి స్థానంలో విప్రజ్ నిగమ్ జట్టులోకి వచ్చాడు.
బౌలింగ్ విభాగంలో అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఫాస్ట్ బౌలర్లుగా తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. స్పిన్ బాధ్యతలను రవి బిష్ణోయ్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇక జపాన్ పర్యటనలో భారత జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ పర్యటన నుంచి విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే.
వివరాలు
భారత్ ప్లేయింగ్ 11 (అంచనా):
వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, విప్రజ్ నిగమ్, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్.